నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఓ మహిళ వెట్టిచాకిరీ కారణంగా మృతి చెందిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఫలితంగా 52 మంది ఒడిశా కూలీలకు విముక్తి లభించింది. కొండయ్య అలియాస్ కొండల్‌రెడ్డి అనే వ్యక్తి మక్తల్ సమీపంలో ఇటుక బట్టీలు ఏర్పాటు చేశాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 53 మంది కూలీలను తీసుకువచ్చి ఇందులో పనిచేయిస్తున్నాడు. ఎనిమిది గంటల పని ఒప్పందంతో తీసుకువచ్చి.. పదహారు గంటలు పనిచేయించాడని కూలీలు ఆరోపించారు.
పనిభారంతో మహిళ మృతి
ఇక్కడ పనిచేసి అనారోగ్యం పాలైనా పట్టించుకునే దిక్కులేదని కూలీలు వాపోయారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన రుక్మిణి అనే మహిళకు ఇటీవల కాన్పు అయింది. ఆమె చేత కూడా నిత్యం పనులు చేయించేవాడని.. పని భారంతో అనారోగ్యం బారిన పడిన రుక్మిణి మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన కలెక్టర్
ఈ విషయం నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు దృష్టికి వెళ్లింది. స్పందించిన పాలనాధికారి కూలీల గురించి ఆరా తీయమని మక్తల్ తహసీల్దార్ శ్రీనివాసులుకు ఆదేశాలు జారీ చేశారు. సంఘటన స్థలానికి వెళ్లిన ఎమ్మార్వో ఇటుక బట్టీల నుంచి 52 మందికి విముక్తి కల్పించారు. వారిని ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు తరలించారు. వలస కూలీలకు ఒక్కొక్కరికి రూ. 20వేల చొప్పున అందించినట్లు తహసీల్దార్ తెలిపారు.
ఇదీ చూడండి: డ్రైవర్ నిర్లక్ష్యం... లారీ కిందపడి ఒకరి దుర్మరణం