నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. వసతి గృహమంతా చెత్తా చెదారంతో నిండిపోవడం వల్ల ఈగలు, దోమలు, పందులు వస్తూ విద్యార్థుల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వ వసతి గృహంలో ఇంత జరగుతున్నా అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యకరం.
110 మందికి ఆరే బకెట్లు
వసతి గృహంలో మొత్తం 110 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో సుమారు 30 మంది వరకు ప్రైవేటు పాఠశాలలో చదవుతుంటారు. ఇంత మందికి సరిపోయే భవనం లేక ఒకే గదిలో దాదాపు 30 మందికి పైగా పడుకుంటున్నారు. స్నానాలు చేసేందుకు స్నానపు గదులు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేవు. ఉన్నవాటికి తలుపులు విరిగిపోయాయి. గదులు లేక ఆరుబయటే స్నానం చేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు ఉదయం లేచినప్పటి నుంచి నీటి సమస్య. కనీసం మూత్రశాలల్లో పోసేందుకు కూడా నీళ్లు లేని పరిస్థితి.
తిష్టవేసిన ఈగలు, దోమలు, పందులు
ఈ సమస్యల వల్ల పాఠశాలకు సరైన సమయానికి వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం కొందరు, సాయంత్రం కొందరు స్నానాలు చేసి బడికి వెళ్తున్నామని వాపోతున్నారు. వసతి గృహంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారమే. ఎంత శుభ్రం చేసినా పైకప్పు నుంచి మట్టి రాలడం, కిటీకిలకు తలుపులు లేక అందులోంచి చెత్త వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. వీటి వల్ల ఈగలు, దోమలు, పందులు వసతి గృహంలోనే తిష్టవేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహం పరిశుభ్రంగా లేకపోవడం వల్ల పిల్లలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
వార్డెన్ ఎప్పుడొస్తాడో తెలియదు
కొంచెం వర్షం పడినా వసతి గృహం గదులు ఉరుస్తున్నాయని రాత్రిళ్లు నిద్ర కూడా పోకుండా కూర్చోవలసి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కనీసం భోజనం చేసేందుకు గదులు లేక ఆరుబయట తినాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు బిక్కుబిక్కుమంటుంటే అండగా ఉండాల్సిన వార్డెన్... ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్లిపోతుంటాడని చెబుతున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో పిల్లలను వసతి గృహాల్లో ఉంచి చదివిస్తున్నామని కానీ వారు ఉన్న భవనాన్ని చూసి అనుక్షణం భయపడుతూ బతకాల్సి వస్తోందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతి గృహానికి సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన... బాధితులకు కలెక్టర్ ఆసరా