బిడ్డ పెళ్లి కోసమని భూమి అమ్మితే... ఆర్నెళ్లైనా చేతికి డబ్బు అందలేదు. పిల్లలకు భూమి పంచేందుకు ఓ తల్లి మూడు నెలలుగా తిరుగుతున్నా స్పందించేవారు లేరు. ఇళ్లు కట్టుకునేందుకు స్థలం కొన్నా... ఆర్నెళ్లైనా రిజిస్ట్రేషన్ కాక... ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు...నెలలు గడుస్తున్నా... భూముల రిజిస్ట్రేషన్లలో ముందడుగు పడటం లేదు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి ధరణి పోర్టల్ పాలిట శాపంగా మారింది. పోర్టల్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గ్రామంలో వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్లే కావడం లేదు. అసలు స్లాటే నమోదు కావడం లేదు. దీంతో క్రయవిక్రయాలు జరిపిన రైతులు... నెలల తరబడిగా నానా ఇబ్బందులకు గురువుతున్నారు. ఒప్పందం మేరకు రిజిస్ట్రేషన్లు జరగక... ఆర్థికంగా నష్టపోతున్నారు.
నిషేదిత భూముల జాబితా
చంద్రవంచ గ్రామ జనాభా 14 వందల వరకు ఉంటుంది. గ్రామంలో సుమారు 615 పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయి. 1,570 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. 260 వరకు సర్వే నెంబర్లున్నాయి. సాధారణంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వం పట్టాలిచ్చిన భూములు, సీలింగ్ భూములు, భూదాన్ భూములు... ఇలాంటివి మాత్రమే ధరణి పోర్టల్ సహా రిజిస్ట్రేషన్ శాఖ దస్త్రాల్లో నిషేదిత భూముల జాబితాలో చేర్చుతారు.
వినతులు వెళ్లినా..
కానీ... చంద్రవంచ గ్రామంలో ఒకటో సర్వే నెంబర్ మొదలు కుని 262వరకూ అన్ని భూముల్ని నిషేదిత జాబితాలో చేర్చారు. ఈ విషయంపై ఇప్పటికే స్థానిక తహసీల్దార్ సహా జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వరకూ వినతులు వెళ్లినా.... సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సాంకేతిక సమస్యలు, అధికారుల తప్పిదం కారణంగా... ప్రస్తుతం ఊరుకు ఊరే ఇబ్బందుల పాలవుతోంది. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో ఆ గ్రామంలో భూముల క్రయవిక్రయాలకు ఎవరూ ముందుకు రావడం లేదు.
సాంకేతిక కారణాల వల్లే చంద్రవంచ గ్రామంలోని భూములు... నిషేదిత భూముల జాబితాలోకి వెళ్లాయంటున్న అధికార యంత్రాంగం... ఆ లోపాల్ని మాత్రం సవరించలేకపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి... ఊరి సమస్య తీర్చాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి : తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం