నారాయణపేట జిల్లా చంద్రవంచ గ్రామం ఎదుర్కొంటున్న ధరణి సమస్యలపై 'ఈటీవీ-భారత్' ప్రసారం చేసిన కథనానికి సీఎస్ సోమేశ్‌కుమార్ స్పందించారు. చంద్రవంచలోని భూములన్నీ ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో చేరిపోయాయి. దీంతో గ్రామంలోని భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ధరణిలో రిజిస్ట్రేషన్ సహా ఇతర లావాదేవీల కోసం దరఖాస్తు చేస్తే స్లాటే నమోదు కాలేదు. నానా ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్థులు.... కలెక్టర్ సహా ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.
ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనానికి స్పందించిన సోమేశ్‌కుమార్.... స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ఐజీ, నారాయణపేట కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. గ్రామంలోని భూములు తప్పుగా నిషేధిత జాబితాలోకి చేర్చినట్లు నిర్ధరణకు వచ్చారు. విచారణ అనంతరం పట్టాభూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.