Minister HarishRao Yadadri Tour: బీబీసీలో కథనం వచ్చిందని ఆ సంస్థలపై ఐటీ దాడులు జరిపిస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుతో ప్రపంచం ముందు భారత్ పరువు పోతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వార్తా కథనంలో తప్పులుంటే వివరణ ఇవ్వాలి తప్పితే, ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీయటమేనన్నారు. మంత్రి హరీశ్‌రావు సతీ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలేరు ఏరియా హాస్పిటల్‌ను అప్ గ్రేడ్ చేయడం కోసం కోటి మంజూరు చేశామని హరీశ్‌రావు అన్నారు. అనంతరం ఆయన యాదాద్రిలో రూ. 35 కోట్ల 95 లక్షలతో నిర్మించే 100 పడకల ఆసుపత్రి భవనానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. వైద్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు.
త్వరలో యాదాద్రి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో మరో 9 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై హరీశ్ మరోసారి మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనలు ఇస్తే కుట్రలు అంటున్నారని మండిపడ్డారు.
ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి ఎందుకు వేశారని ఓ బీజేపీ నేత ప్రశ్నించారని తెలిపారు. కమలం నేతల తరహాలో బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదన్నారు. ఇప్పటి దాకా చేసింది చెప్పుకున్నా గానీ ప్రజలు బీఆర్ఎస్కే ఓటు వేస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నయన్నారు. యువతను రెచ్చగొట్టే రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కవని జోస్యం చెప్పారు. కూల్చేటోళ్లు, పేల్చేటోళ్లు తెలంగాణ ప్రజలకు అవసరం లేదన్నారు. రాజకీయాల కోసం కాదు భక్తితో ఆలయాలను కేసీఆర్ కడుతున్నారని కొనియాడారు. మతం పేరుతో రాజకీయ లబ్ధిపొందాలని చూసే నీచ సంస్కృతి బీజేపీదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో ఉచిత 24 గంటల విద్యుత్ సరఫరా లేదని వివరించారు. త్వరలో యాదాద్రి జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలో 'కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' పథకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మరింత గట్టిగ పనిచేయాలి సూచించారు.
'భారతదేశంలో తెలంగాణ ఇవాళ మూడో స్థానంలో ఉన్నదని నేను మనవి చేస్తున్నాను. డబల్ ఇంజన్ ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వైద్యంలో చిట్టచివరి స్థానం, 28వ స్థానం ఉంది. బీజేపీ నేతల వలే బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదు. చేసింది చెప్పుకున్నా... ప్రజలు బీఆర్ఎస్కే ఓటు వేస్తారు. అది కూల్చేస్తాం, ఇది తవ్వేస్తాం.. అనేది బీఆర్ఎస్ విధానం కాదు. ఉద్యోగ ప్రకటనలు వస్తే కుట్ర అనే వింత నేతలను ఎక్కడైనా చూశామా. ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి ఎందుకు వేశారని భాజపా నేత ప్రశ్నించారు'. -హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి: