నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గుర్రంపోడు మండలంలోని కాల్వపల్లి, పాల్వాయి, మైలపురం, కాచారం గ్రామాల్లో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని...ఉపఎన్నికలో తెరాసకు పట్టంకట్టి ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. మాడుగులపల్లి మండలం గజలపురంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు.
ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలి..
ఏడేళ్లలో సాగర్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆరోపించారు. కాకతీయ కమ్మ సేవాసమితి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జానారెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సాగర్‌ను పర్యాటకంగా ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న జానారెడ్డికి పోటీనే ఉండకూడదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఉపఎన్నికలో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హామీల అమలులో విఫలం
నిడమనూరు మండలంలోని పల్లెల్లో భాజపా అభ్యర్థి రవి కుమార్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని రవికుమార్ విమర్శించారు. ప్రతీ గడపగడపకు వెళ్లి కమలం గుర్తుకే ఓటేయాలని వేడుకున్నారు.
నాగార్జునసాగర్‌లో పాగా వేయాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
ఇదీ చూడండి : లైవ్ వీడియో: యువకుడిపై కర్రలతో దాడి