నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండల నిరుద్యోగ యువత, రైతులు.. దివిస్ ఫార్మా కంపెనీపై ఇచ్చిన ఫిర్యాదుతో సంబంధిత అధికారులు సమావేశమయ్యారు. రైతుల పొలాలను పరిశీలించారు. ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ రసాయనాల వల్ల గాలి, నీరు కాలుష్యాలు ఏర్పడుతున్నాయని.. ఈ ప్రభావంతో కంపెనీ చుట్టుపక్కల పొలాల్లో వ్యవసాయం చేయలేకపోతున్నామని జాతీయ బీసీ కమిషన్‌కు రైతులు తెలిపారు. స్థానికంగా నివసించే కుటుంబాల్లో అర్హత ఉన్న యువతకి కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక్కడి వనరులు వాడుకొని కంపెనీ సీఎస్ఆర్ నిధులను బయటి ప్రాంతాలకు తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పీసీబీ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు ఆదేశాలు
రైతుల ఆవేదన, నిరుద్యోగ యువత ఫిర్యాదుపై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది. ఒక్కో గ్రామంలోని బోరు నుంచి నీళ్ల శాంపిల్స్‌ను తీసుకొని 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పీసీబీని కమిషన్ ఆదేశించింది. కంపెనీలో పనిచేస్తున్న స్థానిక, స్థానికేతర ఉద్యోగుల వివరాలను తెలపాలని లేబర్ డిపార్ట్మెంట్కు సూచించింది. అనుమతులు లేకుండా కంపెనీ విస్తరణ జరుగుతోందని రైతులు తెలపడంతో దీనిపై సంబంధిత శాఖ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అన్ని శాఖల అధికారులతో చర్చించి 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కమిషన్ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: హన్మకొండలో కరోనా నిబంధనలు గాలికొదిలి సెమిస్టర్ పరీక్ష..