నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు లబ్ది చేకూరేలా ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. 5,875 ఎకరాలకు నీరిచ్చేలా రూ. 75.93 కోట్లతో మూసీనదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్ ఎత్తిపోతల చేపట్టనున్నారు. 4,175 ఎకరాలకు నీరిచ్చేలా రూ. 72.16 కోట్లతో నాగార్జునసాగర్ ఫోర్ షోర్పై నెల్లికల్ ఎత్తిపోతల చేపట్టనున్నారు.
చిట్యాల వద్ద బల్నేపల్లి- చంప్లాతండా వద్ద రూ. 219.90 కోట్లతో ఎత్తిపోతలకు అనుమతినిచ్చారు. వాడపల్లి వద్ద రూ. 229.25 కోట్లతో మరో ఎత్తిపోతలకు అనుమతినిచ్చారు. ఏఎమ్మార్పీ ఎత్తిపోతల 8,9 డిస్ట్రిబ్యూటరీలకు నీరు సరఫరా అయ్యేలా మరమ్మత్తులు, పైప్లైన్ పనుల కోసం రూ. 2.47 కోట్లతో నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లగొండ జిల్లా హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. డిగ్రీ కళాశాలను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇవీ చూడండి: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విధివిధానాలపై కేసీఆర్ సమీక్ష