munugode by election మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా తెరాస అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోంది. భాజపా, కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కొంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్నిప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డి సహా ఇతర నేతలు నియోజకవర్గంలో ఉండి ఉపఎన్నికకు పార్టీ శ్రేణులను సంసిద్ధులను చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఉపఎన్నికకు సంబంధించి నేతలతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
గత వారం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన తన వ్యూహాలను వివరించారు. ఈ నెల 15 నుంచి క్షేత్రస్థాయి కార్యాచరణ చేపట్టాలని... కేసీఆర్ ఆదేశించారు. వంద మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎన్నికల పర్యవేక్షణ, ప్రచారబాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన మునుగోడు వ్యూహరచన కమిటీ సమావేశమై గణాంకాలను పొందుపరిచింది.
మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు, నాంపల్లి, సంస్థాన్ నారాయణపురం, మర్రిగూడ, చౌటుప్పల్, చండూరు మండలాల్లో 159 గ్రామాలున్నాయి. వాటిలో రెండువేలకుపైగా జనాభా ఉన్న 15 మేజర్ గ్రామపంచాయతీలున్నాయి. చౌటుప్పల్, చండూరు పురపాలికల పరిధిలో 30 వార్డులున్నాయి. రేండేసి గ్రామాలు, వార్డుల లెక్కన 85 యూనిట్లు, 2000కి పైగా జనాభా ఉన్న గ్రామాలను 15 యూనిట్లుగా చేసి మొత్తంగా మునుగోడును వంద యూనిట్లుగా గుర్తించి సీఎంకు వారు నివేదిక ఇచ్చారు.
తెరాసకు 103 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీల బలం ఉంది. వారిలో నుంచి 100 మందిని ఈనెల 10 లోపు ఎంపిక చేసి గ్రామాలు, వార్డుల బాధ్యతలను కేసీఆర్ అప్పగించనున్నారు. శాసనసభ సమావేశాల అనంతరం ఒక రోజు విరామం తర్వాత..... వారు నిర్దేశిత గ్రామాలకు వెళ్లి కార్యకర్తలను కలిసి కార్యాచరణ ప్రణాళికను వివరించనున్నారు. వీరికి తోడుగా జడ్పీ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర నేతలు ఆయా గ్రామాల్లో పార్టీ నిర్దేశించిన బాధ్యతల్లో ఉంటారు.
ఇవీ చూడండి:
Teachers Day 2022: ప్రథమ నమస్కారం గురువుకే ఎందుకో తెలుసా?
నేడు నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్ ప్రారంభోత్సవం, భారీ బహిరంగసభ