నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో పలువురు హస్తం పార్టీలో చేరారు. హాలియా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో త్రిపురారం మండలం కంపాసాగర్కు చెందిన 50మంది తెరాస కార్యకర్తలు మాజీ మంత్రి జానారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి జానారెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.
తెరాస గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని జానారెడ్డి విమర్శించారు. రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి... ఇప్పటివరకు అతీ గతీ లేదన్నారు. సీఎం కేసీఆర్ ధన్యవాద సభలో గోదావరి నీళ్లు పెద్దదేవులపల్లి రిజర్వాయర్లోకి తెచ్చి నల్గొండ జిల్లాకు సాగు నీరు ఇస్తామన్నారని... కానీ సాగర్ జలాశయం నీటి వాటాను ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం హాలియా ప్రధాన కూడలిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సంతు సేవాలాల్ 283వ జయంతి ఉత్సవాలను జానారెడ్డి ప్రారంభించారు.
ఇదీ చదవండి: సాగర్ అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధం: మంత్రి జగదీశ్ రెడ్డి