Nalgonda Tourist Places: ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా బాసిల్లుతోంది. యాదాద్రి దివ్య క్షేత్రం.. ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. భక్తులకు మరిన్ని వసతులు సమకూరుతున్నాయి. ఆలయ ఆధునికీకరణ పనులు ముగిస్తే.. మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంకో చెప్పుకోదగ్గ ప్రదేశం కొలనుపాక. జైన, వైష్ణవ, హిందు, వీరశైవ మతాలకు పుట్టినిల్లు. ఇక్కడికి నిత్యం భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఇదే కాకుండా నల్గొండలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, సూర్యాపేటలోని పిల్లలమర్రి, యాదాద్రి జిల్లా ఆకారం గ్రామంలోని సూర్యదేవాలయం వంటివి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఆయా క్షేత్రాలను ప్రభుత్వం గుర్తించి వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
బెస్ట్ టూరిజం విలేజ్..
Nalgonda District Tourism: పోచంపల్లి ప్రపంచస్థాయిలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించిన 'బెస్ట్ టూరిజం విలేజ్ ' పోటీల్లో విజేతగా నిలిచి పర్యాటకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా.. చేనేత కళాకారులు ఆన్‌లైన్‌లో నేరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏకశిలా కొండపై ఉన్న చారిత్రక కట్టడం భువనగిరి ఖిల్లా సందర్శకులను ఆకట్టుకుంటోంది. దాదాపు 600 మీటర్ల ఎత్తులో ఏకశిలపై నిర్మించిన కోటను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
'నల్గొండ జిల్లా.. పర్యాటకుల ఖిల్లా. ఇప్పటివరకు ఈ జిల్లా పర్యాటకాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. కానీ తెరాస అధికారంలోకి వచ్చాక కాస్త అభివృద్ధి కనిపిస్తోంది. దేశంలో సూర్యదేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆకారం గ్రామంలో చాలా ప్రాచీన సూర్యదేవాలయం ఉంది. అది శిథిలావస్థకు చేరింది. ఆ గుడిని కాపాడాలని.. దానికి పూర్వవైభవం తీసుకురావాలని అక్కడి స్థానికులు.. కొందరు పర్యాటకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.'
- ఆదోని వెంకటరమణా రావు , ఐక్యరాజ్య సమితి సభ్యుడు
'పానగల్లులోని చాయా సోమేశ్వరస్వామి ఆలయం లాంటి చాలా విశిష్టమైన గుళ్లు ఉన్నాయి. కానీ వారసత్వ సంపద అంతా నేడు కనుమరుగవుతోంది. ప్రభుత్వం దృష్టి సారించి ఈ వారసత్వ సంపదను కాపాడాలి. నల్గొండ జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. టూరిస్టులు వారంతట వారే పర్యాటక ప్రాంతాలను వెదికి.. అక్కడ సేద తీరుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు.. ప్రాచీన కట్టడాలు.. వారసత్వ సంపదకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.'
- ప్రకృతి ప్రేమికుడు
నాగార్జునసాగర్ సోయగం..
Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్‌లోని ప్రధాన డ్యాం, ప్రధాన విద్యుత్కేంద్రం, నాగార్జునకొండ పర్యాటకులు చూడదగిన ప్రదేశాలు. ఇక్కడే మరొక చెప్పుకోదగ్గ ప్రదేశం బుద్ధవనం. సాగర్‌హిల్ కాలనీ వద్ద 270 ఎకరాల్లో బౌద్దానికి సంబంధించిన విషయాలను తెలిపేలా నిర్మాణాలు చేపట్టారు. 8 పార్కులను ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభించాలని పర్యాటకులు కోరుతున్నారు. నాగార్జునసాగర్ చూడ్డానికి వచ్చిన పర్యాటకులు నాగార్జునకొండను సందర్శిస్తారు. 4 ఏళ్ల క్రితం గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాదంతో సేవలు నిలిపేశారు. సరైన జాగ్రతలు తీసుకొని తిరిగి లాంచీ సేవలు ప్రారంభించాలని కోరుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే.. అభివృద్ధి చెందడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!