Thefts at Banks in Nalgonda : బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుని వెళ్లే అమాయకులే ఆ ముఠా లక్ష్యం. వేసుకున్న పథకం ప్రకారం బ్యాంకు వద్ద మాటువేసి.. నగదుతో బ్యాంకు నుంచి బయటకు వచ్చే వారిని అనుసరించి.. అదను చూసి డబ్బు దోచేయడం ఈ గ్యాంగ్ చేసే పని. గడిచిన వారం రోజుల్లో ఇదే తరహాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురు అమాయకుల నుంచి రూ.10 లక్షలకు పైగా ఎత్తుకెళ్లినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
Thefts at Banks in Nalgonda News : నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో ఇటీవల ఓ మహిళ రూ.1.50 లక్షలు డ్రా చేసింది. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఆమెను అనుసరించారు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి ఆమె మెడపై గోకుడు వచ్చే స్ప్రే కొట్టారు. దీంతో ఆమె తన చేతిలో ఉన్న డబ్బుల బ్యాగును పక్కన బెట్టి.. స్ప్రే ప్రభావం నుంచి తేరుకునేలోపు ముఠా సభ్యులు తమ పని కానిచ్చేశారు. నగదు ఉన్న బ్యాగుతో క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. ఏం చేయాలో తోచని ఆ మహిళ కుటుంబసభ్యులకు సమాచారం అందించి.. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.
సేమ్ సీన్ రిపీట్..: మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ దుండగులు సేమ్ సీన్ రిపీట్ చేశారు. స్థానికంగా ఉన్న ఓ బ్యాంకు నుంచి ఓ వ్యక్తి రూ.1.25 లక్షల నగదు డ్రా చేసుకుని వస్తుండగా.. అతని మెడపైనా స్ప్రే చల్లి.. అతడు తేరుకునేలోపు డబ్బులతో ఉడాయించారు. దీంతోపాటు మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్, నార్కట్‌పల్లి పీఎస్ పరిధి, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో పలు దొంగతనాలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
రోజురోజుకూ ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్లే వారిపై స్ప్రే కొట్టి.. బాధితులు తేరుకునేలోపు డబ్బులు మాయం చేస్తున్న ఈ దుండగులు తమిళనాడు, స్టువర్టుపురం ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు ఒకే బైక్‌పై ముగ్గురు తిరుగుతూ.. ఎక్కువ శాతం బ్యాంకు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేసే వారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
జాగ్రత్త తప్పనిసరి..: ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడానికి నల్గొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాల పోలీసులు పలుచోట్ల సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమైన ఫొటోల ఆధారంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకునే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇంటికి చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. పంటలు చేతికొచ్చిన ఈ సమయంలో రైతన్నలు మరింత జాగ్రత్త వహించాలంటున్నారు.