పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నల్లొండ జిల్లా మిర్యాలగూడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసనకు దిగారు. అడ్డూఅదుపూ లేకుండా ధరలు పెరుగుతుండటంతో రవాణా రంగం సంక్షోభంలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా నష్టపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న... రవాణా రంగంపై ధరల పెంపు భారంగా మారిందని వాపోయారు.
పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా కిరాయిలు పెరగటంలేదని అన్నారు. దీంతో లారీలు నడపడం కష్టంగా మారిందని తెలిపారు. తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర భారం మోపుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డీజిల్, పెట్రోల్ ధరల తగ్గుదలకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ మీడియా సమావేశం