Spurious cotton seeds : వానాకాలం మొదలైంది. అన్నదాతలు పంటల సాగుకు సిద్ధం అవుతున్నారు. ఈసారి పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో విత్తనాలకు గిరాకీ పెరిగింది. ఈ పరిస్థితిని అదునుగా భావించిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ విత్తనాల సరఫరా దందాకు తెరలేపారు.
గతంలో నకిలీ విత్తనాలతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. కల్తీ విత్తనాలను సరఫరా చేసే వారిపై నిఘా పెట్టాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో.. అప్రమత్తమైన పోలీసుశాఖ నకిలీ విత్తనాలను సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈరోజు ఉదయం నార్కట్పల్లి మీదుగా మహరాష్ట్రకు నకిలీ పత్తివిత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ముందస్తు సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో నార్కట్పల్లి పీస్ పరిధిలో టాస్క్ఫోర్స్ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. ఈ ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడ్డ నిందితుల్లో గోరంట్ల నాగార్జున సికింద్రాబాద్, గడ్డం రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా, మెరిగే వేణు నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తులు కలిసి ఈ దందా చేస్తున్నట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి కోటి 80 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో తక్కువ ధరకు విత్తనాలు కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దాచపల్లిని ప్రధాన కేంద్రంగా చేసుకొని తెలంగాణ ,మహారాష్ట్ర,నాగపూర్ మొదలైన ప్రాంతాల రైతులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు మీడియా సమావేశంలో వెల్లడించారు.
"కర్ణాటకలో తక్కువ ధరకు విత్తనాలు కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దాచపల్లిని ప్రధాన కేంద్రంగా చేసుకొని తెలంగాణ, మహారాష్ట్ర, నాగపూర్ మొదలైన ప్రాంతాల రైతులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో నార్కట్పల్లి పీస్ పరిధిలో టాస్క్ఫోర్స్ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది." - అపూర్వరావు, నల్గొండ జిల్లా ఎస్పీ
ఇవీ చదవండి: