నల్గొండ జిల్లా పెద్దఆడిషర్లపల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామంలో 58 మందికి ఈనెల 13న కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 45 మందికి పాజిటివ్ రాగా.. ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. ఒకేసారి పెద్ద ఎత్తున కేసులు నమోదవ్వడం పట్ల అధికారులు విస్మయం చెందారు.
గ్రామంలో ఇటీవలే ఓ వివాహ వేడుక జరగడం, ప్రజలు ఉపాధి పనులకు పెద్ద ఎత్తున ఆటోల్లో తరలివెళ్లడం వల్ల కేసులు ఎక్కువగా నమోదయ్యాయేమోనని వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మరో 46 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి మాత్రమే నెగిటివ్ వచ్చింది.
పాజిటివ్ వచ్చిన వారందరికి మరోసారి పరీక్షలు నిర్వహించగా..అందిరికీ నెగిటివ్ రావడం వల్ల అధికారులు, గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. పరీక్ష కిట్లలో సాంకేతిక లోపం వల్ల తప్పుడు ఫలితం వచ్చిందని అధికారులు నిర్ధరణకు వచ్చారు.
ఇదీ చదవండిః నీటి సంపులో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం