ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణవాసి నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన 25 ఏళ్ల యువకుడు కోణం సందీప్ స్థానం దక్కించుకున్నారు. ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేష కృషి చేసిన 30 ఏళ్ల లోపు యువకులతో ఆ సంస్థ రూపొందించిన అండర్ 30 జాబితాలో సందీప్ పేరును చేర్చింది. ఈనెల 1న అమెరికాలో దీనిని విడుదల చేసింది.
సందీప్ పరిశోధనలు
కృత్రిమ మేధా ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్‌ను రూపొందించినందుకు సందీప్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇతర దేశాల్లోని వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు అత్యంత భద్రంగా రోగులకు వారి మాతృ భాషలోకి ఈ యాప్ అనువాదం చేసి అందిస్తుందని సందీప్ తెలిపారు. 2018లో డాక్టర్ శివరావుతో కలిసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ''అబ్రిడ్జి'' పేరుతో హెల్త్ కేర్ గ్రూప్ సంస్థను స్థాపించిన సందీప్... వైద్యరంగంలో ఎదురవుతున్న సవాళ్లపై పరిశోధనలు చేస్తున్నారు. ఇడుపులపాయ ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్ చదివిన ... అమెరికాలోని కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో రోబోటిక్స్ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. పలు హెల్త్ కేర్ టెక్నాలజీ అప్లికేషన్లు రూపొందించారు.
సేవా కార్యక్రమాలపై ఆసక్తి
క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే క్లినికల్ ట్రయల్స్, పాక్షిక అంధత్వం గల వారికి ఉపయోగపడే యాప్, బయోమెట్రిక్ పద్ధతిలో క్యాన్సర్ పరీక్ష వంటివి ఆవిష్కరించారు. సందీప్ కోణం పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రభుత్వ పాఠశాల్లో పిల్లల్ని చదువు వైపు ఆకర్షించేలా వర్చువల్ రియాల్టీ ప్రాజెక్టులు చేపట్టారు. సందీప్ తండ్రి కోణం శ్రీనివాస్ కనగల్ మండలంలోని కురంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.
"ఈ గౌరవం దక్కిందనందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యున్నత పురస్కారానికి ఎంపిక కావడానికి అబ్రిడ్జ్ కో- ఫౌండర్ డాక్టర్ శివరావు ఇతర సభ్యులు సహాయసహకారాలు అందించారు. మా కుటుంబ సభ్యుల సహకారంతో ఇది సాధించగలిగాను"
-కోణం సందీప్
ఆనందంలో తల్లిదండ్రులు...
తమ కుమారుడు సాధించిన ఈ ఘనత పట్ల సందీప్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవాడని... సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడని తండ్రి తెలిపారు.
ఇదీ చదవండి: ఫోర్బ్స్ జాబితాలో నల్గొండ యువకుడు.. కేటీఆర్ అభినందన