నదీ జలాల పంపిణీ విషయంలో రాష్ట్రానికి రావాల్సిన వాటాలను రాబట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర భాజపా నాయకులు విమర్శించారు. ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికీ చర్లగూడెం ప్రాజెక్టు, నక్కలగండి ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని ఆరోపించారు. చేతకాని ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా చండూరు చౌరస్తాలో నేతలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, అక్రమ ప్రాజెక్టుల కట్టడాలు చేపడుతున్నా అడ్డుకోలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు.
బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 299 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు రాష్ట్రానికి ఉన్నా.. కనీసం 200 టీఎంసీల నీటిని కూడా వాడుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని నాయకులు దుయ్యబట్టారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారనీ, ఇప్పటికైనా నీటి వాటా కోసం పోరాడాలనీ, లేని పక్షంలో భాజపా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు