నాగార్జునసాగర్ డ్యాం ప్రపంచంలో ఏడోస్థానం, భారతదేశంలో ద్వితీయ స్థానం కల్గిన బహుళార్థక ప్రాజెక్ట్. దీని కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 22 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందుతోంది. 26 గేట్లను కలిగి ఉన్న ఈ డ్యాం నీటిమట్టం గరిష్ఠ స్థాయి (590 అడుగులు)కు చేరినపుడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తారు. 600 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే జల సవ్వడి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ దృశ్యాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
ప్రధాన విద్యుత్కేంద్రం: ఇందులోని 8 యూనిట్ల ద్వారా 810 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ముఖ్యంగా వేసవికాలంలో విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి వీలుగా దిగువనున్న నీటిని జలాశయంలోకి రివర్స్ పంపింగ్ చేయడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పవచ్ఛు
అనుపు: ఇది సాగర్ జలాశయానికి అనుకొని ఉన్న ప్రాంతం. ఇక్కడి నది ప్రాంతమంతా బీచ్‌ను పోలిఉండి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక్కడ బౌద్ధమతానికి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి.
బుద్ధవనం: సాగర్ హిల్‌కాలనీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యాటక సంస్థ సంయుక్తంగా సుమారు 270 ఎకరాలలో బుద్ధవనం నిర్మిస్తున్నారు. ఇందులో 8 రకాల వివిధ పార్కులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 5థీమ్ పార్కుల పనులు పూర్తి చేశారు. ఇక్కడ ప్రపంచంలోని వివిధ దేశాలలోని బౌద్ధమత స్తూపాలు, బుద్ధుని జననం నుంచి మరణం వరకు తెలియచేసే చిత్రాలున్నాయి. శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవకాన బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
నాగార్జునకొండ: ఇది సాగర్ జలాశయం మధ్యలో ఉన్న మ్యూజియం. ప్రపంచంలోని ఐలాండ్ మ్యూజియంలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే గతేడాది ఏపీలో జరిగిన ఘోర పడవ మునక ప్రమాదం అనంతరం ఇక్కడికి వెళ్లేందుకు లాంచీలకు అనుమతి ఇవ్వడం లేదు.
ఇదీ చదవండి : పర్యాటకంలో ప్రోత్సాహకం... వివిధ విభాగాలకు అవార్డుల ప్రదానం