Revanth Reddy Fires On TRS And BJP: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అభ్యర్థి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాశ్ నేత తదితరులతో కలిసి సంస్థాన్ నారాయణపురం మండలం బోటిమీది తండా, వాయిలపల్లి, జనగాం గ్రామాల్లోఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామగ్రామాన రోడ్ షో చేశారు. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కోరుకోలేదని.. కొంత మంది నాయకులు తమ స్వార్థం కోసం తీసుకొచ్చారని విమర్శించారు. ఈ ఉప ఎన్నికతో ప్రజలకు లాభం చేకూరాలి కానీ.. నాయకులకు కాదన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన వేలాది ఎకరాల పేదల భూములను తెరాస ప్రభుత్వం గుంజుకుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే తెరాస, భాజపాలను ఎందుకు గెలిపించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చంపాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మునుగోడు గడ్డపై గెలవకపోతే కాంగ్రెస్‌ను చంపాలనుకుంటున్న పార్టీల కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కొత్త సీసాలో పాత సారాలా..: మునుగోడు గడ్డపై కాంగ్రెస్ గెలిస్తే.. 2023లో 100 సీట్లతో తాము అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని గెలిపిస్తే.. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామని చెప్పారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 12సార్లు ఎన్నికలు జరితే.. ఒక్కసారి కూడా భాజపాకు డిపాజిట్లు వచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కొత్త సీసాలో పాత సారాలా.. రాజగోపాల్ రెడ్డి కొత్త స్టిక్కర్‌తో ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను అనని మాటలను అన్నట్లుగా సీపీఐ నేత సాంబశివరావు చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీని లేకుండా చేయాలనుకున్న కేసీఆర్‌కు మద్దతు ఎందుకు ఇస్తున్నారని మాత్రమే తాను ప్రశ్నించానన్నారు. తాను కమ్యూనిస్టులను అవమానపరిచినట్లు నిరూపిస్తే.. ధర్మ బిక్షం విగ్రహం ముందే ముక్కు నేలకు రాస్తానని రేవంత్ సవాల్ విసిరారు.
పట్టాలు ఇప్పించే బాధ్యత మాది..: మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పోడు భూముల సమస్యపై కోట్లాడి పట్టాలు ఇప్పించే బాధ్యత తమదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజనులకు కాంగ్రెస్ ఎంతో గౌరవం ఇచ్చిందని.. గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో తెరాస, భాజపాలు గిరిజనులకు ఏం ఇచ్చాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ గిరిజనులకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజగోపాల్ రెడ్డి ఏం వెలగబెట్టారని.. ఎనిమిదేళ్లుగా మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డి గిరిజనులకు ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు.
ఇవీ చదవండి: 'ఇక్కడి నాయకులు ఫార్మా కంపెనీ యాజమాన్యాలకు అమ్ముడుపోయారు'
137 ఏళ్లలో మూడు సార్లే అధ్యక్ష ఎన్నికలు.. ఈసారి సరికొత్త లెక్క.. పార్టీ పరిస్థితి మారేనా?