Revanth Reddy Election Campaign at Nakrekal : సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది నల్గొండ గడ్డ అనీ.. రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది నల్గొండ వీరులని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) చెప్పారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి పదవినే వదులుకున్నారని గుర్తు చేశారు. అయితే కొందరు మాత్రం కాంగ్రెస్ నుంచి గెలిచి దొరల గడీ వద్ద కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన 12 మందిని మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.
ఇసుక మీద ఎవరైనా పిల్లర్లు, ప్రాజెక్టులు నిర్మిస్తారా అంటూ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. లక్షన్నర కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మూడేళ్లకే కుంగుతుందా అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నల్గొండకు నీరు ఇచ్చే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. అలాగే 10 కిలోమీటర్ల టన్నెల్ పదేళ్లుగా ఎందుకు పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ తన ఫాంహౌజ్ చుట్టూ రిజర్వాయర్లు కట్టుకుని.. నల్గొండకు మాత్రం నీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ సీఎంలు రూ.69 వేల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే.. కేసీఆర్ మాత్రం 9 ఏళ్లలోనే రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ జెండా ఎగరొద్దన్నారు.
కేటీఆర్ వయసుకు మించి మాట్లాడుతున్నారు - బీఆర్ఎస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ : మైనంపల్లి
"ఈ నకరేకల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే గుండెల మీద తన్ని పార్టీ ఫిరాయించి మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ గేటును తాకనీయవద్దు. ఇప్పుడు మీరిచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి. మేడిగడ్డ బ్యారేజీ ఇసుక మీద కట్టాడు అంటే.. మతి ఉండి కట్టిండా." - రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Congress Vijaya Bheri Sabha at Nalgonda : ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు అనే విధానంతో కేసీఆర్ ముందుకెళుతున్నారని.. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) మాత్రం తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో మీరు ఇవ్వబోయే తీర్పు వందేళ్లు వరకు చరిత్రలో నిలిచిపోవాలని కోరారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి, కాంగ్రెస్కు పేరొస్తుందనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శించారు. ఎవడు దొంగ.. ఎవడు గజదొంగో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy Fires on CM KCR : నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని.. నీళ్లేమో జగన్, నిధులు మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ తీసుకెళ్లారని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నియామకాలు అనేవి కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయని విమర్శించారు. మనవడిని మంత్రిని చేసేందుకు కేసీఆర్ మూడోసారి అవ్వాలని అంటున్నారని ధ్వజమెత్తారు.
పేదోడికి ప్రగతిభవన్లోకి ప్రవేశం లేదు.. నాడు గద్దరన్నను కూడా లోపలి రానీకుండా ఎర్రటి ఎండలో బయట నిలబెట్టారని ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు లోపల అతిథి మర్యాదలు.. మనం మాత్రం ఎండలో మగ్గిపోవాలా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ బక్కోడు కాదు.. లక్ష కోట్లు దిగమింగిన బకాసురుడు అని దుయ్యబట్టారు. ఇక్కడ కేసీఆర్కు సీసాలో సారా పోసేవారు.. నేడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారని ధ్వజమెత్తారు.
యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంది తెలంగాణలోనే : జైరాం రమేశ్
బీజేపీ, బీఆర్ఎస్లో ఉంటే పవిత్రులు - ప్రతిపక్షంలో ఉంటే ద్రోహులా? : రేవంత్ రెడ్డి