నల్గొండ జిల్లా పెద్దవుర మండలం పులిచర్లలో ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందే కేసీఆర్ సాగర్‌లో పర్యటించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒడిపోతారని తెలిసి మళ్లీ వస్తారని తెలుస్తోందని పేర్కొన్నారు. దుబ్బాకకు ఒక్కసారి కూడా వెళ్లని కేసీఆర్ సాగర్‌కు రెండు సార్లు ఎందుకు వస్తున్నారో ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చనిపోయిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు.
ఎలక్షన్లను కలెక్షన్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. భగత్‌కు టికెట్ ఇవ్వడం చివరి నిమిషంలో దాకా తేల్చుకోలేక పోయారని.. గుత్తా, తేరా, కోటిరెడ్డి పేర్లను పరిశీలించి సానుభూతి పనికొస్తుందని భగత్‌కు ఇచ్చారని వ్యాఖ్యానించారు. జానారెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న రేవంత్... తెరాస మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లలో ఎవరినైనా పంపించమని సవాల్ విసిరారు. తెలంగాణ బిల్లును ఆమోదించడానికి జానారెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని జానారెడ్డి వదులుకుని తెలంగాణ కావాలన్నారని వెల్లడించారు.
సాగర్ హిల్ కాలనీలో ప్రైవేట్ టీచర్ దంపతులు ఆత్మహత్య చేసుకుంటే వారిని ఎవరూ పలకరించలేదని విమర్శించారు. సాగర్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ మద్యం ఏరులై పారుతోందన్నారు. సాగర్ ఎన్నికలో తెరాస రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ ధరకే ప్రైవేటులో కొవిడ్ చికిత్స : మంత్రి ఈటల