నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భాస్కరరావు ఆయన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్డీవో రోహిత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆర్డీవో రోహిత్ సింగ్ వివరించారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటివద్దనే భూముల వివరాలు తెలుసుకుంటున్నారని తెలిపారు. డివిజన్లో ఇప్పటివరకు 2,152 స్లాట్లు బుక్ చేసుకున్నారని వెల్లడించారు. వివాదాస్పద భూముల సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 271 ఆర్వోఆర్ కేసులను కలెక్టరేట్‌కు బదిలీ చేసినట్లు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిందని... డివిజన్ పరిధిలో 259 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి రెండువేల చెట్లను పెంచుతున్నట్లు తెలిపారు. రైతు వేదికలు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలతో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. మిర్యాలగూడ డివిజన్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: ఫిల్మ్‌సిటీలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రామోజీరావు