రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఇరు రాష్ట్రాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తి ఆపాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేసినా.. తెలంగాణ జెన్‌కో అధికారులు లెక్కచేయకుడా ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.
నాగార్జునసాగర్‌లో ప్రధాన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో జెన్‌కో అధికారులు యథావిధిగా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. సాగర్ జలాశయం ప్రధాన ద్వారం వద్ద, విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికు వెళ్లే దారిలో పోలీసులు బలగాలు మోహరించాయి. ఏపీలోనూ పోలీసు బలగాలు మోహరించగా.. సిబ్బంది సంఖ్యను కాస్త తగ్గించారు. పులిచింతల వద్ద 60 మంది, నాగార్జున సాగర్ వద్ద 150 మందితో భద్రత కొనసాగిస్తున్నారు.
తెలంగాణ విద్యుదుత్పత్తి నిలిపివేత కోసం ప్రయత్నాలు చేస్తున్న ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 176 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. తెలంగాణ జెన్‌కో పూర్తిస్థాయిలో కరెంటు ఉత్పత్తి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ఇంకా ప్రారంభం కానందున జలవిద్యుత్ కోసం వినియోగించే నీరు సముద్రంలో కలిసి వృథా అవుతుందని ఏపీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ జల జగడం విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.