నల్గొండలోని జమా మసీద్ చాకలి బజార్లో నల్లగంతుళ్ల రాములు, వల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. కొడుకు పేరు పుల్లయ్య. ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో తండ్రి మందలించడంతో... పుల్లయ్య ఇంటి నుంచి పారిపోయాడు. పలు ప్రాంతాల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ... జీవనం సాగించాడు.
అలా ఓ రోజు.. దిక్కుమొక్కు లేని వారిని చేరదీసి ఆదుకునే 'అన్నం ఫౌండేషన్' వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాస్ రావు పుల్లయ్యను చూశాడు. లాక్డౌన్ సమయంలో.. రోడ్డు మీద ఇబ్బందులు పడుతున్న పుల్లయ్యను చేరదీశాడు. మొదట్లో తన వారి గురించి చెప్పేందుకు పుల్లయ్య నిరాకరించినా... తర్వాత అతని వివరాలు ఫౌండేషన్ సభ్యులకు తెలిపాడు.
మా నాన్న కొట్టాడని ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. పలు జిల్లాల్లో తిరుగుతూ భిక్షం ఎత్తుకున్నాను. నన్ను అన్నం ఫౌండేషన్ సభ్యులు చేరదీశారు. నా కుటంబ సభ్యుల వద్దకు తీసుకువచ్చారు.
-పుల్లయ్య
అతను చెప్పిన వివరాలతో.. పోలీసుల సాయంతో నల్గొండలో విచారణ చేపట్టారు. తల్లిదండ్రులు చనిపోయారని... ఇద్దరు అక్కలు ఉన్నారని తెలిసింది. అన్ని విషయాలు నిర్థారించుకున్న తర్వాత కుటుంబ సభ్యులను కలిసి పుల్లయ్య గురించి తెలిపారు.
ఇంక లేడు రాడు అనుకున్న తమ్ముడు మళ్లీ వచ్చాడు. తనకు ఇష్టం ఉంటే మేము సంతోషంగా చూసుకుంటాం. మా తల్లిండ్రులను మేమే చూసుకున్నాం. ఇప్పుడు తమ్ముడిని సైతం చూసుకుంటాం.
-రేణుక, పుల్లయ్య సోదరి
40 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ్ముడి జాడ తెలియడంతో అతని అక్కలు రేణుక, దుర్గ ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. తనకి ఇష్టం అయితే తమతోనే ఉంచుకుంటామని తెలిపారు. లేడనుకున్న తమ్ముడిని కలిపినందుకు శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: అక్కగా పుట్టింది.. అమ్మగా మారింది