నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తమ పార్టీకి చెందిన నాయకులపై కాకుండా ఎదుటి పార్టీలోని నేతలు.. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని ఓటర్లను ప్రభావితం చేసే వారిని తమ పార్టీలో చేర్చుకునేలా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గ్రామంలో 200 నుంచి 500 ఓట్ల వరకు ప్రభావితం చేసే వారిపై దృష్టి సారించి వారికి పెద్ద మొత్తం ఇచ్చి పార్టీలో చేర్చుకునేందుకు మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుపుతున్నారు. తమ పార్టీ రెండో శ్రేణి కార్యకర్తలు, నాయకుల కంటే ఎదుటి పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ విలువ ఇస్తుండటంతో ఈ పార్టీలో ఉన్నవారు ఎదుటి పార్టీల్లో చేరుతున్నారు. గత కొన్నాళ్లుగా నియోజకవర్గంలో ఫిరాయింపుల రాజకీయం జోరుగా సాగుతోంది.
ఓ పంచాయతీ నుంచి సర్పంచి పదవికి ఓ ప్రధాన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి రూ.8 లక్షల వరకు ఖర్చు చేసి పరాజయం పాలయ్యారు. కొన్నాళ్ల నుంచి ఆ గ్రామంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ నాయకులు ఈయన్ను పట్టించుకోలేదు. ఆ పంచాయతీలోనే ఎదుటి పార్టీ నుంచి గెలిచిన సర్పంచిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఓడిపోయిన అభ్యర్థి ఆగ్రహంతో ఎదుటి పార్టీలోకి మారారు. ఆగమేఘాల మీద స్పందించిన స్థానిక మండల ప్రచార ఇన్‌ఛార్జి తిరిగి పార్టీలోకి రమ్మనగా సదరు అభ్యర్థి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆ మొత్తం ఇచ్చి ఇటీవల ఆయన్ను తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు.
మరో ప్రధాన పార్టీకి చెందిన ఓ నాయకుడు తన పార్టీ అభ్యర్థికి మద్దతుగా రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. ఈ మొత్తం ఇవ్వాలని ఆ పార్టీ నాయకులను అడిగితే అదిగో ఇదిగో అన్నారు తప్పితే ఎలాంటి ఫలితంలేదు. రాత్రికిరాత్రి ప్రత్యర్థి పార్టీ ముఖ్య నాయకుడొకరితో సమాలోచనలు జరిపి రూ.5 లక్షలు తీసుకొని ఆ పార్టీలో చేరారు. ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తానికి తాము రెండు రెట్లు ఇస్తామని తిరిగి పార్టీలోకి రమ్మని ఆయన సొంత పార్టీ నుంచి బుజ్జగింపులు మొదలయ్యాయి.
ఇవీ చూడండి: జోరుగా నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం