ఈనెల 21న జరిగే హుజూర్నగర్ ఉప ఎన్నిక కోసం... మొత్తం 76 నామినేషన్లు, 119 సెట్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు, వివిధ సంఘాల వారు, భూ బాధితులు... ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చిన దరఖాస్తుల్లో సగానికిపైగా తిరస్కరణకు గురయ్యాయి. ఈ పరిణామం పట్ల... అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ నామపత్రాలు తిరస్కరణకు గురికావటంతో ఆయన నిరసన తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. సీపీఎం ఆందోళనతో ఆ పార్టీ అభ్యర్థిని అధికారులు కార్యాలయంలోకి తీసుకెళ్లి నామినేషన్ ఎందుకు తిరస్కరణకు గురైందో ఆయనకు వివరించారు. దీన్ని అంగీకరించని సదరు అభ్యర్థి... అధికారుల ఎదుటే ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ బరిలో ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. అటు వికలాంగుల సంఘానికి చెందిన వ్యక్తుల నామపత్రాలు కూడా... తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వారు కూడా హుజూర్ నగర్ ఆర్వో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఉప ఎన్నికల్లో పోటీకి అర్హత సాధించిన 31 మందిలో... ఎంతమంది ఉపసంహరించుకుంటారనేది ఎల్లుండి తెలియనుంది.
ఇవీ చూడండి: హుజూర్‌నగర్‌లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ