నాగార్జునసాగర్ ఉపఎన్నికకు నామినేషన్లు కోలాహలంగా సాగాయి. నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికకు మొత్తం 78 మంది నామినేషన్లు దాఖలు చేయగా... ఇవాళ ఒక్కరోజే 58 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. కార్యకర్తలతో తరలిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఓటర్లను ప్రలోబపెట్టకుండా బరిలో ఉన్న మిగతా అభ్యర్థులు, ఆయా పార్టీల అధినేతలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అర్థించారు.
జానా వ్యాఖ్యలు అర్ధరహితం
తెరాస అభ్యర్థి నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్, మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి నామపత్రాలు సమర్పించారు. భగత్‌కు ప్రజలు బ్రహ్మరథం పడతారని జగదీశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారం చేయొద్దన్న జానారెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని మంత్రి జగదీశ్ రెడ్డి ఆక్షేపించారు. ఏడేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గెలుస్తామని ధీమా
భాజపా అభ్యర్థి రవికుమార్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి నామినేషన్ వేశారు. జనరల్ స్థానంలో గిరిజన బిడ్డకు అవకాశం కల్పించారని, తప్పక నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తారని రవికుమార్ ధీమావ్యక్తం చేశారు. తెలుగుదేశం నుంచి మువ్వా అరుణ్ కుమార్ .. నామపత్రాలు దాఖలు చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి సాగర్ ప్రజానీకం ఓటేయాలని అరుణ్‌కుమార్ కోరారు. సాగర్‌లో గెలుస్తామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు.
పార్టీలకు దీటుగా..
ప్రధాన పార్టీలకు దీటుగా పలువురు స్వతంత్ర అభ్యర్థులు సాగర్ బరిలో నిలిచారు. బుధవారం నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. ఏప్రిల్ 3 దాకా ఉపసంహరణకు గడువు ఉంది. ఏప్రిల్ 17న సాగర్ పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితం తేలనుంది.
సాగర్ ఉప ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణ సమితి అభ్యర్థిగా పూస శ్రీనివాస్ బరిలో దిగారు. నిరుద్యోగులను ఆదుకోవడంలో తెరాస సర్కార్ విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: సాగర్ సమరం: ముగిసిన నామినేషన్ల గడువు