నాగార్జునసాగ్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.37 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. రూ.3.5 లక్షల విలువ చేసే మద్యం పట్టుబడినట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.
నంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి వాహనాలు రోడ్లపైకి రావొద్దని... అలా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. బహిరంగ సభలకు వచ్చే నాయకులు, ప్రజలు విధిగా మాస్కులు ధరిస్తూ కరోనా నియమాలను పాటించాలని వ్యాఖ్యానించారు. ఈనెల 17న జరగనున్న ఉపఎన్నిక నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2500 మంది విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గం
- మొత్తం పోలింగ్ రూట్లు- 39
- మొత్తం పోలింగ్ కేంద్రాలు- 346
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 108 (31%)
- బైండోవర్- 2500 మంది
వారిలో...
- తెరాస- 370 మంది
- కాంగ్రెస్- 280 మంది
- భాజపా- 40 మంది
- ఇతరులు
ఇదీ చదవండి: మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య చర్చల ప్రక్రియ క్లిష్టమైనది: హరగోపాల్