అక్రమ లే-అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చినా ఎల్‌ఆర్‌ఎస్ (లే-అవుట్ రెగ్యులరైజేషన్)లతో దండిగా పురపాలికలకు నిధులు సమకూరే అవకాశముంది. తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006లో ఇదే పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చి 2010 వరకు గడువు పొడిగిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంది. తెరాస ప్రభుత్వం 2016 మార్చిలో ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టి అదే ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు విధించి రూ. కోట్లల్లో ఆదాయం సమకూర్చుకొంది.
గతంలో నాలుగువేల దరఖాస్తులు..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పట్లో ఏడు పురపాలికలు ఉండగా సుమారు రూ.30 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఒక నల్గొండ మున్సిపాలిటీలో సుమారు 4 వేల దరఖాస్తులు రాగా వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.11 కోట్ల ఆదాయం ఖజనాలో జమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలతోపాటు, గ్రామాలు కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించారు. కానీ సరైన స్పందన లేకపోవడంతో ప్రభుత్వం విధిలేక పూర్తి స్థాయిలో అక్రమ లే-అవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని పురపాలికల్లో మరో సారి క్రమబద్ధీకరణ పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది.
భారీ ఆదాయం
పాతికేళ్ల కింద రిజిస్ట్రేషన్ అయినా అనుమతి లేని ప్లాట్లను కూడా క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిందే అని చెప్పడంతో ఒక్కొ మున్సిపాలిటీలో సుమారు 20 వేల నుంచి 60 వేల ప్లాట్లు క్రమబద్ధీకరణకు వచ్చే అవకాశముందని మున్సిపాలిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. సగటున ఒక ప్లాటుకు రూ.60,000 చొప్పున లెక్కిస్తే వందల కోట్లల్లో ఆదాయం వచ్చే అవకాశముంది. నల్గొండ మున్సిపాలిటీలో పరిశీలిస్తే సుమారు 50,000 వరకు అనుమతి లేని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వాటిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల ప్రకారం ఒక నీలగిరిలోనే రూ.300 కోట్ల ఆదాయం రానుంది. మిగతా సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, చండూరులో ఇదే మాదిరిగా పుర ఖాజానాలో నిధులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.