ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy Comments) అన్నారు. నల్గొండ జిల్లా డిండి మండలం శేషాయకుంటలో మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్‌తో కలిసి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. వివేకానందుని సందేశ స్ఫూర్తితో ముందుకు నడవాలని ఉత్తమ్ కోరారు. ఎస్సీఎస్టీలకు 17 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ముఖ్యమంత్రి మోసం చేశారని పేర్కొన్నారు. పార్లమెంట్లో తెరాస ఎంపీలు ఒక్కరు కూడా రిజర్వేషన్లపై మాట్లాడలేదన్నారు.
మోసం చేసేందుకే...
తెలంగాణ దళిత సమాజాన్ని మోసం చేసేందుకే దళితబంధు(Dalita Bandu)ను తీసుకువచ్చారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు పథకమని పేర్కొన్నారు. 2023లో జరిగే ఎన్నికలలో దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి 50వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యకర్తలకు అండగా...
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ముందుకు వెళ్లాలని ఉత్తమ్ కోరారు. నిజాయతీతో పనిచేసే కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టబోతున్నట్లు తెలిపారు. డిండి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కొవిడ్‌తో మృతి చెందిన వివేకానంద యువజన అధ్యక్షుడు వరికుప్పల బాబు కుటుంబానికి పార్టీ తరపున రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, నల్లవెల్లి రాజేశ్ రెడ్డి, సిరాజ్ ఖాన్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: D.Srinivas joins Congress : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక.. నిజమేనా?