Artist gets 27 Lakhs per Annum with Paintings : ఇంటర్మీడియట్ రెండుసార్లు తప్పాడు. అనుకున్న రంగంలో రాణించాలంటే... తెలియనితనంతో తల్లిదండ్రులు వద్దన్నారు. అయినా పట్టు విడవలేదు. అనుకున్నది సాధించాలని పల్లె నుంచి పట్నం చేరాడు. చదువు కొనసాగించి నచ్చిన రంగంలోకి దూకేసాడు. ఇక అందులో రాణించి లక్షల కొలువు కొట్టాడు. అత్తెసరు చదువులు వద్దని, ఆసక్తి ఉన్న రంగమే ముద్దంటున్నాడు ఈ యువకుడు.
Special Story on Nalgonda Animation Artist Raghavendra : అద్భుతంగా చిత్రాలేస్తున్న ఈ యువకుడి పేరు గంజి రాఘవేంద్ర. నల్గొండ జిల్లా మునుగోడు పరిధిలోని గట్టుప్పల్ నివాసి. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే విపరీతమైన ఆసక్తి. సమయం దొరికితే చాలు బొమ్మలేయడమే పనిగా ఉండేది. కానీ, చదువులో వెనకబడ్డాడు. ఇంటర్ తప్పాడు. కానీ, కుంగిపోలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హెచ్‌సీఎల్‌లో సీనియర్ టెక్నికల్ లీడ్‌గా లక్షలు ఆర్జిస్తున్నాడు.
Nalgonda Animation artist Raghavendra : ఇంటర్ తప్పిన తర్వాత సప్లిమెంటరీ రాశాడు. ఆ ఫలితంలోనూ మార్పులేదు. తమకున్న రైస్ మిల్ బాధ్యతలను రాఘవేంద్ర తీసుకున్నాడు. రెండుమూడేళ్లు ఆ పనిచేశాడు. ఆ సమయంలోనే తెలంగాణలోని కళాకారులే స్ఫూర్తిగా తను ఎంచుకున్న చిత్రలేఖనం గురించి శోధించాడు. అప్పుడు ఫైన్ ఆర్ట్స్ చేసేందుకు కష్టపడి అత్తెసరు మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తర్వాత శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫైన్‌ఆర్ట్స్ పూర్తిచేశాడు.
భలారే చిత్రం భలా.. గీతల్లోనే అద్భుతం ఆవిష్కరణ
'నాకు చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. దాంతో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఇంటర్ తర్వాత రైస్‌మిల్ బాధ్యతలు చూసుకునేవాడిని. మూడు సంవత్సరాలు ఎడ్యుకేషన్‌లో గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో ఇంటర్నెట్లో పలు అంశాలపై సెర్చ్ చేశాను. నాలో ఉన్న కళ ఏంటి అని ఆలోచించి.. ప్రధానంగా నాకు ఇష్టమున్న పెయింటింగ్ గురించి బాగా సెర్చ్ చేశాను. దాని గురించి ఎమైనా కోర్సులు ఉన్నాయా.. భవిష్యత్ ఎలా ఉంటుందనే దానిపై చాలా శోధించాను. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫైన్‌ఆర్ట్స్ పూర్తి చేశాను. అప్పుడే బాగా రీసెర్చ్ చేసి యానిమేషన్ రంగంలోనూ ప్రావీణ్యం సంపాదించాను.' - గంజి రాఘవేంద్ర, చిత్రకారుడు
నాడు ఇంటర్ ఫెయిల్.. నేడు హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం : ఏమీ చేయలేనేమో అనే స్థితి నుంచి ఓ స్థాయికి చేరుకున్నాక ఉద్యోగ అన్వేషణలో పడ్డాడు. యానిమేషన్ రంగంలోనూ పట్టు సాధించి, మొదటిసారిగా 2013లో నెక్ట్స్ ఎడ్యుకేషన్‌లో 3డీ రూపకల్పనలో ఉద్యోగం సాధించాడు. టైమ్స్ అనే ప్రముఖ గేమింగ్స్ సంస్థలో 5 సంవత్సరాలు 3డీ ఆర్టిస్టుగా విధులు నిర్వర్తించాడు. దీని తరవాత అమోజాన్ సంస్థలో ఏఆర్, వీఆర్ భాగంలో 3డీ ఆర్టిస్టుగా మూడేళ్లు పనిచేశాడు.అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం హెచ్‌సీఎల్ కంపెనీలో సంవత్సరానికి రూ.27 లక్షల వేతనం అందుకుంటున్నాడు. చిత్రలేఖన కళకు ఆధునిక సాంకేతికత జోడించడం వల్లే ఇది సాధ్యమయిందుటున్నాడు.
కళా నైపుణ్యంతో 30 జాతీయ పురస్కారాలు : చేనేత కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఏర్పడిందంటున్నాడు. అలా తన కళాత్మక చిత్రాలను చాలా చోట్ల ప్రదర్శనలకు ఉంచేవాడు. కష్టానికి ప్రతిఫలంగా ఇప్పటి వరకు 30 జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్ ఆడడం, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు ఎక్కువగా చూడడంతో ఎప్పటికైనా ఆ రంగంలో ఉన్నత స్థాయికి చేరాలనుకున్నాడు. కష్టపడి మంచి స్థానానికి ఎదిగాడు.
వావ్.. న్యూస్పేపర్స్తో అందమైన శిల్పాలు.. 'జానకి రామ్' టాలెంట్ అదుర్స్!
చిత్రకళతో పాటు పలు రంగాల్లో రాణిస్తున్న యువకుడు : ఒక్క చిత్ర కళ ఒక్కటే కాక నేచర్ ఫొటోగ్రఫీ, పురాతన చారిత్రక దేవాలయాల చిత్రీకరణ, ట్రావెలింగ్, డాక్యుమెంటరీలు తీస్తున్నాడు రాఘవేంద్ర. ఇటీవల తాను తీసిన వీవర్స్ ఆఫ్ ఇండియా అనే డాక్యుమెంటరీ దిల్లీ యూనివర్సిటీలోని ఇంద్రప్రస్థ ఉమెన్స్ కళాశాలలో చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఏడో తేదీన ప్రదర్శించనున్నారు. పలు తెలుగు సినిమాలకు గ్రాఫిక్ విభాగాల్లో పనిచేశాడు.
పిచ్చి గీతలు అనుకున్నాం.. అవే నేడు ఈ స్థాయిలో ఉంచాయి : ఎప్పుడూ బొమ్మలేస్తుండడం చూసి ఏంటి ఈ పిచ్చి గీతలు అనుకునేవాళ్లం. కానీ ఇప్పడు ఈ స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రపంచమంతా సాంకేతికత వైపు పరుగులు తీస్తుంది. ఏ రంగంలోనైనా టెక్నాలజిదే హవా అంటున్నారు. సాంకేతికతపై మరింత పట్టు సాధించి ఫారిన్ వెళ్లడమే లక్ష్యం అంటున్నాడు. దానికి తోడు పుట్టిన నేలకు, యువతకు అండంగా ఉంటానంటున్నాడు ఈ యువకుడు.
Portraits with Millets : చిరుధాన్యాలతో జీవం ఉట్టిపడే అందమైన చిత్రాలు
Micro Artist Srijith : మైక్రో ఆర్ట్స్‌తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు