నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్న తెరాస నేతలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. భగత్ గెలుపును కాంక్షిస్తూ... ఎమ్మెల్యే గాదరి కిషోర్ గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ తెరాస ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించారు. సాగర్ నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే అధికార పార్టీనే గెలిపించాలని ఎక్కించాలని కోరారు. త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఓటమి భయంతోనే కొలువుల విషయంలో విపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నోముల భగత్ అధిక మెజారిటీతో గెలుస్తారని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు.
పథకాలను చూసి తీర్పు ఇవ్వండి
నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో నోముల భగత్‌కు మద్దతుగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మూడు దశాబ్దాలుగా జానారెడ్డినే గెలిపిస్తున్నా... అభివృద్ధి చేసింది శూన్యమని విమర్శించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తీర్పు ఇవ్వాలని ఓటర్లను కోరారు.
కాంగ్రెస్ అభ్యంతరం
నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బుడ్డి తండాలో ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెరాసకు అనుకూలంగా ఏకగ్రీవంగా ఓటు వేయాలని ప్రమాణం చేయించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీనియర్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు త్రిపురారం పోలీస్ ఠాణా ఎదుట ఆందోళనకు దిగాయి. పోలీసులు, యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ నినాదాలు చేశారు. తండా వాసులను ప్రలోభపెట్టి అనుకూలంగా ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: జానారెడ్డి గెలుపు చారిత్రక అవసరం: సీతక్క