తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓటు వేసే ప్రతి ఒక్కరికి గ్లవ్స్ అందించడంతోపాటు పోలింగ్ గదిలో శానిటైజర్ అందుబాటులో ఉంచారు. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంల మొరాయింపుతో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ కొన్ని చోట్ల ఆలస్యమైంది. 2 వందల మీటర్ల దూరం నిబంధన విధించడంతో ఈసారి పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీల హంగామా తగ్గిపోయింది. ఓటరు రశీదులు సైతం సిబ్బంది నుంచి మాత్రమే తీసుకోవాలని ఈసీ ఆదేశించడంతో రాజకీయ పార్టీల షామియానాలు కనిపించలేదు. పైలాన్ కాలనీ, హిల్ కాలనీలో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సరళిపై ఆరా తీశారు.
నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఓటువేశారు. తెరాస అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. త్రిపురారం మండలం పలుగుతండాలో భాజపా అభ్యర్థి రవికుమార్, చింతగూడెంలో తెలుగుదేశం అభ్యర్థి అరుణ్ కుమార్ ఓటేశారు.
సాగర్ ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 2లక్షల20వేల 300 మంది ఓటర్లు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 108 సమస్యాత్మాక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఉపఎన్నికకు సంబంధించి మే 2న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చదవండి: నాలుగు రోజుల్లోగా పట్టణాల్లో చెత్త కనిపించొద్దు: కేటీఆర్