నాగర్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో ఎన్నికల సందడి షురూ అయింది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అధికార తెరాస పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించడమే లక్ష్యంగా గులాబీ నేతలు కసరత్తులు చేస్తున్నారు.
ప్రచారంలో అధినేతలు
ప్రచారం ముగియడానికి ముందురోజు నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు సమాచారం. ఈ నెల 14న బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దాన్ని త్వరలోనే నిర్ణయించనున్నారు. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా రెండు రోజులు రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే రోడ్ షోలు ఎక్కడెక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్నది ఖరారు కానుంది.
అక్కడే మకాం...
ఇక భగత్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించింది. సోమవారం రాత్రే హాలియా చేరుకున్న తలసాని... స్థానిక నేతలతో చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఫోన్ చేయడంతో సాగర్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న గురవయ్య యాదవ్, రంజిత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లను బుజ్జగించారు. భగత్‌కు టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని వారికి వివరించారు. రెండు రోజుల్లో వారిని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి భరోసా ఇప్పించే ప్రయత్నాల్లో తలసాని ఉన్నట్లు తెలుస్తోంది.
గెలుపే లక్ష్యంగా..
పార్టీ ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గంలో పర్యటించాలని, భగత్ గెలుపు కోసం పనిచేయాలని తెలంగాణ భవన్ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: కేసీఆర్ అండ, నాన్న కృషే నన్ను గెలిపిస్తాయి: నోముల భగత్