నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా... తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలుపెడతారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన కొద్దిసేపటికే ఈవీఎంల ప్రక్రియ ప్రారంభిస్తారు. మొత్తం 1,388 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు మూడు గంటల పాటు సమయం పట్టనుంది. అదే సమయంలో దానికి సమాంతరంగా ఈవీఎంల లెక్కింపు జరగనుండగా... ఇందుకోసం రెండు గదుల్ని సిద్ధం చేశారు. ఒక్కో గదిలో 7 టేబుళ్ల చొప్పున రెండింట్లో 14 ఏర్పాటు చేసి... మొత్తం 25 రౌండ్లలో లెక్కింపు కొనసాగిస్తారు. గత నెల 17న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించగా.. 41 మంది పోటీపడ్డారు.
సాయంత్రానికి తుది ఫలితం..
ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు ఇంచుమించు 20 నిమిషాలకు పైగా సమయం పట్టనుంది. తొలి రౌండ్ ఫలితం ఉదయం తొమ్మిదింటికి వచ్చే అవకాశం ఉండగా... సాయంత్రానికి తుది ఫలితం వెలువడనుంది. ప్రతి టేబుల్‌కు సూపర్ వైజర్, సహాయ సూపర్ వైజర్తోపాటు మరో ముగ్గురు సిబ్బందిని కేటాయించారు. మొత్తంగా 400 మంది సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా చూస్తే తొలుత... గుర్రంపోడు మండల ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత వరుసగా పెద్దవూర, తిరుమలగిరి సాగర్, అనుముల, నిడమనూరు, మాడుగులపల్లి, త్రిపురారం మండలాల ఓట్ల లెక్కింపు చేపడతారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపునకు హాజరయ్యే వారందరికీ ప్రత్యేకంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, ఏజెంట్లకు ఒకరోజు ముందుగానే... లెక్కింపు కేంద్రం ప్రాంగణంలో కొవిడ్ పరీక్షలు చేశారు. మూడంచెల భద్రత వ్యవస్థతోపాటు... పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదంటూ ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆదేశాలిచ్చారు.ఇదీ చదవండి: రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు
ఇదీ చూడండి: ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించేలా సర్కారు అడుగులు