సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార తెరాస దూసుకుపోతోంది. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. తెరాస అభ్యర్థి నోముల భగత్ తల్లి నోముల లక్ష్మితో కలిసి హాలియాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రచారం నిర్వహించారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. నోముల భగత్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
విమర్శలే అస్త్రంగా..
నల్గొండ జిల్లా పెద్దవూరలో నిర్వహించిన సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. పట్టభద్రులు, ఉద్యోగ సంఘాలను బెదిరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలిచిందని ఆరోపించారు. నల్గొండను దత్తత తీసుకుంటానన్న కేసీఆర్... మూడేళ్లైనా రాలేదని ఎద్దేవా చేశారు. త్రిపురారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు స్థానికులతో ముచ్చటించారు. కేంద్రం చర్యల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు రోడ్డున పడ్డారని ఆరోపించారు. తెరాసను గెలిపిస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పట్టించుకోడని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా... నియోజకవర్గంలో టీఎన్జీవో జిల్లా కార్యవర్గం సమావేశం నిర్వహిచడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉందని ఎన్నికల అధికారికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలంటే నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డికి ఓటేసి గెలిపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా నిడమనూరులో జరిగిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్... 5 లక్షల కోట్లకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.
ఒక్క అవకాశం ఇవ్వండి
తిరుమలగిరి మండలంలోని పలు తండాల్లో భాజపా అభ్యర్థి రవికుమార్ ప్రచారం నిర్వహించారు. ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. హాలియాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భాజపా నేతలు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆర్ అని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సాగర్ ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, జానారెడ్డికి ఏదో చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'అత్యవసరమైతేనే బయటకి రండి.. కరోనా వస్తే బెడ్లు దొరకవు'