Hyderabad Musi Project Gates Lifted : ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా కొన్ని నష్టాలు వాటిల్లితే కొంత మంచి జరిగిందని చెప్పవచ్చు. గత రెండున్నర దశాబ్దాలుగా మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన చరిత్ర లేదు. కానీ ఈసారి కురిన వర్షాల కారణంగా ముందుగానే గేట్లు ఎత్తివేయాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత జూన్ మొదటి వారంలో మూసీ ప్రాజెక్టు గేట్లను ఎత్తినట్లు అధికారులు చెప్పారు.
వర్షాల పైనే ఆధారపడి నిండు కుండలా ఉండే మూసీ ప్రాజెక్టు... వర్షాకాలంలో కురిసే వానలకు నిండి యాసంగి కాలంలో సాగయ్యే పంటలకు నీటిని అందించడం ఆనవాయితీగా జరుగుతుంది. గత రెండున్నర దశాబ్దాలుగా జూన్ మొదటి వారంలో మూసీ గేట్లు ఎత్తిన చరిత్ర లేదు. ఈ సంవత్సరం యాసంగి పంటల సాగుకు నీరు అందించి కాలువలన్నింటికి నీరు అందించండం ఆపేసినప్పటి నుంచి మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం తదితర జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి వాగులు, వంకల ద్వారా ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరింది.
దీనివల్ల మండు వేసవిలో కూడా మూసీ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం రోజురోజుకు పెరుగుతూ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రిజర్వాయర్ నీటిని ఈ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ వరకు ప్రాజెక్టుకు ప్రధాన, కుడి, ఎడమ కాలువల ఆయకట్టు ప్రాంతాలను విడుదల చేశారు. నీటి విడుదల చేశాక నీటిమట్టం 622 అడుగుల కనిష్ఠ స్థాయికి చేరింది. అప్పటి నుంచి వర్షాల కారణంగా వస్తున్న నీటితో రిజర్వాయర్ నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు చేరింది. దీంతో సోమవారం రోజున డ్యామ్ క్రస్టు గేట్లను అధికారులు ఎత్తి దిగువ మూసీలోకి నీటిని విడుదల చేశారు.
Musi Gates lifted Due To Heavy Flow : మూసీ ప్రాజెక్టు చరిత్రలో రెండున్నర దశాబ్దాల నుంచి జూన్ మొదటి వారంలో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం అనేది ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్ 28న, 2021లో జులై 13వ తేదీన గేట్లు తెరిచారు. అయితే ఆ రెండేళ్లలో అప్పటికే వానాకాలం వర్షాలు విపరీతంగా కురిశాయి. అయినా కానీ.. ఇరవై ఐదు సంవత్సరాలలో వర్షాకాలం ప్రారంభం అవ్వకముందే మూసీ పూర్తిగా నిండి గేట్లు ఎత్తడం కొత్త రికార్డును నమోదు చేసుకుంది.
మూసీ ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్‌తోపాటు, ఇతర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ఎండాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు అధికంగా వరదనీరు వచ్చింది. దీనికి తోడు ఎస్సారెస్పీ కాలువ ద్వారా యాసంగి పంటలు కోతకు వచ్చే వరకు వచ్చిన నీరు రావడంతో ప్రాజెక్టు నిండింది.
ఇవీ చదవండి: