నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో దళిత ప్రైవేటు టీచర్ రవికుమార్ దంపతుల ఆత్మహత్య, విద్యావాలెంటీర్లు, ప్రైవేటు అధ్యాపకుల దుస్థితిపై సీఎం కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక హిల్ కాలనీలో రెండు రోజుల కిందట రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబసభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.
భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య అక్కమ్మ కూడా బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారని ఆరోపించారు. ఏడేళ్లుగా దళితులు దగాకు గురవుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వర్గానికి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని మండి పడ్డారు.
'రవి కుమార్ పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. సీఎం సహాయ నిధి నుంచి వారి పేరు మీద రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్ చేయాలి. ప్రైవేటు ఉపాధ్యాయులకు మీరు ఇస్తామని చెబుతోన్న రూ. 2000 ఏ మూలకు సరిపోదు. ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు, విద్యావాలెంటీర్లు, ప్రైవేటు కళాశాలల లెక్చరర్లకు నెలకు రూ. 5000 ఆర్థిక సాయం, 25కిలోల బియ్యం ఇవ్వాలి.'
రేవంత్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ
ఇదీ చదవండి: రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉంది: ద.మ. రైల్వే జీఎం