ఆధునిక పోకడలు, బిడ్డ ఎప్పుడు ఏ క్షణానికి భూమి మీదకు రావాలో తల్లిదండ్రులు ముంద నిర్ణయించి ఆపరేషన్లు చేస్తున్న రోజులివి. నెలలు నిండిన గర్భిణులు కాన్పు కోసం ఆస్పత్రి మెట్లెక్కితే కత్తెర కోత లేనిదే బిడ్డ బయటికి రావడం లేదు. నల్గొండ జిల్లా దేవరకొండ ధర్మాసుపత్రి ఏప్రిల్ మాసంలో అత్యధిక కోత కాన్పులు నిర్వహించి రికార్డులకెక్కింది. అందుకు ప్రతిఫలంగా ముగ్గురు వైద్యులకు ఉన్నతాధికారుల నుంచి అందాయి.
కత్తెర కాన్పులపై శ్రీముఖాలు
ఆసుపత్రికి నియోజకవర్గ పరిధిలొని 7 మండలాలతోపాటు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని సరిహద్దు తండాల రోగులు నిత్యం వెయ్యి మంది పైకి వస్తుంటారు. 150 నుంచి 200 మంది ఇన్‌పేషంట్లుగా ఉంటారు. లాక్‌డౌన్ సమయం వలసవెళ్లినవారు స్వగ్రామాలకు చేరారు. ఫలితంగా మరింత రద్దీ పెరిగింది. దీంతో నెలవారీ ప్రసవాలు సంఖ్య కూడా దాదాపు రెట్టిపైంది. ఏప్రిల్ మాసంలో 177 ప్రసవాలు జరిగాయి. ఇందులొ కత్తెర కోతలు 100 కాగా మిగిలిన 77 సాధారణ ప్రసవాలు. ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా సిజేరియన్లు చేసిన గైనకాలజీ విభాగంలో పనిచేసే వైద్యులు హాబీతా, శశికళ, శాంతి స్వరూపలకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా శ్రీముఖాలు జారీచేశారు.
తరచూ ఇలాంటి పరిస్థితే
దేవరకొండ వైద్యశాలలో తరచూగా ఇలాంటి పరిస్థితే నెలకొంటుంది. తక్కువ సమయంలో ఆపరేషను ముగుస్తుండటంతో ఇటు తల్లిదండ్రులు, అటు వైద్యులు కోతల వైపు మొగ్గు చూపుతున్నారు. వైద్యశాల జిల్లా కేంద్రానికి సుదూరంలో ఉండటంతో జిల్లా అధికారులు దృష్టి అంతగా ఉండటం లేదు. ఫలితంగా వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ కోత కాన్పులపై ఇక్కడి వైద్యులకు ఉన్నతాధికారుల ఆక్షింతులు పడిన సందర్భాలు అనేకం.
తగ్గించేందుకు చర్యలు
దేవరకొండ ధర్మాసుపత్రిలో ఏప్రిల్ మాసంలో లాక్‌డౌన్ నేపథ్యంలో గుంటూరు, హైదరాబాద్‌కు వలసవెళ్లిన వారు తిరిగి స్వగ్రామానికి వచ్చారు. ఫలితంగా దేవరకొండ వైద్యశాలలో అధిక ప్రసవాలు జరిగాయి. ఇందులో సిజేరియన్లు అధికంగా ఉండటం నిజమే. వైద్యులకు ఇటీవల శ్రీముఖాలు జారీ చేశారు. మే మాసంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- మాతృనాయక్, డీసీహెచ్