IT Hub in Nalgonda: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సమ్మిళిత వృద్ధి కొనసాగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా తెలంగాణ రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. నల్గొండలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 110 కోట్లతో నల్గొండలో ఐటీ హబ్ నిర్మాణం జరగనుంది. ఈ ఐటీ హబ్ ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి దొరకనుంది. 18 నెలల్లోగా ఈ హబ్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను ఆయన ప్రారంభించారు. నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన మంత్రి కేటీఆర్‌కు తెరాస నేతలు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ రాక సందర్భంగా నల్గొండ బైపాస్ నుంచి 2 వేల బైక్‌లతో తెరాస శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. మంత్రులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్వాగతం పలికారు.
సామాన్యులకూ అందాలి
KTR Nalgonda tour: అనంతరం పట్టణంలో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను నిర్మూలించామని కేటీఆర్ వెల్లడించారు. 65 ఏళ్లలో జిల్లాలో సాధ్యంకాని ఫ్లోరోసిస్ సమస్యను ఆరేళ్లలోనే పరిష్కరించామని చెప్పారు. ఐటీ సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలన్నదే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. 75వేల చదరపు అడుగుల్లో 750మంది కూర్చొనేలా నిర్మించబోయే ఐటీ హబ్ ద్వారా 15 కంపెనీలు 1600 ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పారు.
స్థానికులకు ఉద్యోగాలు
Foundation stone for IT hub in Nalgonda: 'ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఉగాదిలోపు నిజామాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. అతి త్వరలో మహబూబ్‌నగర్‌లో ప్రారంభం కాబోతున్నది. రాబోయే 16-18 నెలల్లో నల్గొండలో కూడా మళ్లీ మేమే వస్తాం.. ఐటీ హబ్‌ని ప్రారంభిస్తాం. తద్వారా స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తాం. ఐటీ హబ్‌లో స్టార్టప్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటాం. నల్గొండలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తాం. కొత్తగా పేద ప్రజల కోసం నల్గొండ పట్టణంలో ఐదు బస్తీ దావాఖానాలను ఈరోజే మంజూరు చేస్తున్నాం. మరో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నాం. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు కూడా రూ.4.5 కోట్లతో ఈరోజు శంకుస్థాపన చేశాం. ఆధునికమైన రెండు వైకుంఠ ధామాలకు రూ.మూడు కోట్లతో పనులు మొదలుపెట్టాలని ఈరోజే ఆదేశిస్తున్నాం. మున్ముందు రోడ్లు, జంక్షన్లను సుందరీకరించి నల్గొండ ముఖచిత్రాన్ని మార్చే బాధ్యత మాది.'
-కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
అభివృద్ధి కార్యక్రమాలు
రాష్ట్రానికి అత్యధికంగా బియ్యం అందిస్తున్న జిల్లా నల్గొండ అని కేటీఆర్ కొనియాడారు. దేశానికి అత్యధికంగా బియ్యం సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందని.. కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా.. ఏకకాలంలో గ్రామాలు, పట్టణాలకు సకాలంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
'రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోండి. దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అన్నదాతకు రైతుబంధు ద్వారా పెట్టుబడి ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. భారత ఆర్థిక వ్యవస్థకు 4 వ ఆర్థిక చోదక శక్తిగా తెలంగాణ ఉందని ఆర్బీఐ నివేదికలో వెల్లడైంది.' అని కేటీఆర్ సభలో మాట్లాడారు.
ఇదీ చదవండి: Drugs Control in Telangana: మాదకద్రవ్యాల కట్టడిలో సఫలమైన అబ్కారీ శాఖ