ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన గోదావరి జలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి. సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి... కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, సైదిరెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ దీపిక పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని మంత్రి అన్నారు. ఉమ్మడి జిల్లాలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మల్కాపూర్ ఇండస్ట్రీ, యాదాద్రి ఆలయ అభివృద్ధి, బీబీనగర్ ఎయిమ్స్, 80 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించడం వంటి అభివృద్ధి పనులు మచ్చుకు కనిపిస్తున్నాయన్నారు.
"ఆరేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ పీడ నుంచి బయటపడగలిగింది."
- జగదీశ్‌రెడ్డి, మంత్రి
ఇవీ చూడండి: సీఎం కాన్వాయ్కి అడ్డొచ్చిన యువకుడు.. కేసు నమోదు