ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీల్లో తెరాస విజయం సాధిస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పురపాలిక ఎన్నికల సన్నాహాక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎవరెన్ని చెప్పినా... ప్రజలు తెరాస వెంటే ఉన్నారని పేర్కొన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో విజయంతో ఈ జిల్లా కేసీఆర్ ఖిల్లా అని నిరూపించారన్నారు.
ఇన్నాళ్లు కాంగ్రెస్ కంచుకోట అన్నారని... కానీ ఇప్పుడది మంచుకోట అయ్యిందని ఎద్దేవా చేశారు. తెరాస గులాబీ కోట అని వ్యాఖ్యానించిన జగదీశ్ రెడ్డి... ఎన్నికలకు ముందే టీపీసీసీ అధ్యక్షుడు ఓటమి అంగీకరించారని విమర్శించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిశీలకులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ నూతన సీఎస్‌గా సోమేశ్ కుమార్