Guttha Sukhender reddy: మునుగోడులో ఉపఎన్నిక వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నిండా మునిగిపోగడం ఖాయమని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయని వ్యక్తి... రాజీనామా చేసి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశాన్ని మరింత కాలం సాగదీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలిలో విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక ఇప్పట్లో రాకపోవచ్చునని స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్త కాదని.. రాజకీయాలకు మండలాల ఏర్పాటుకు సంబంధమేమిటన్నారు.
గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదని.. రాజ్యాంగ హోదాల్లో ఉన్న వారు తమ పరిధిలో ఉండాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుగు రాష్ట్రాలపై వివక్షకు నిదర్శనమన్నారు. జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ స్థానాలు పెంచిన కేంద్రం.. తెలంగాణ, ఏపీలో భిన్న వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ, నియంత పాలన వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ వేయడం అన్యాయమన్నారు.
రాష్ట్రంలో మళ్లీ తెరాస అధికారంలోకి వస్తుందని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. పోలవరం వల్ల ముంపును తగ్గించాలని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. తెలంగాణను సంప్రదించకుండానే ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. పోలవరం అనగానే హైదరాబాద్‌ను కలుపుతారా అంటున్న వారు 1956కు ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. అప్పుడు ఏపీ మద్రాస్‌లో ఉందన్న విషయం మరిచిపోవద్దన్నారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునగడానికి కారణం మానవ తప్పిదం కాదని.. ప్రకృతి వైపరీత్యమేనన్నారు. వైఎస్ షర్మిల కోరుకుంటున్న రాజన్న రాజ్యం ఏపీలో ఉండాలని తెలంగాణలో అవసరం లేదన్నారు. రాజన్న రాజ్యమంటే తెలంగాణ ఎక్కడిదన్నారు. తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలన్న పెద్ద మనిషి వైఎస్ఆర్ అని గుత్తా వ్యాఖ్యానించారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయని.. పదికిలోమీటర్ల లైనింగ్ పూర్తయిందని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి: ఓయూ వీసీ ఛాంబర్ ముట్టడి.. పీహెచ్‌డీ నోటిఫికేషన్ విషయంలో..