నల్గొండ జిల్లాలో కేఆర్‌ఎంబీ(KRMB News) ఉపసంఘం సభ్యుల పర్యటన ముగిసింది. ఇవాళ నాగార్జునసాగర్(Nagarjuna Sagar) ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్‌ను బృంద సభ్యులు పరిశీలించారు. గ్యాలరీ నుంచి సీపేజ్ వాటర్ లెవెల్ కొలతలు సేకరించారు. ప్రధాన జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పరిశీలించాలనుకున్నా... రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో వెనుదిరిగారు. సాగర్ జలాశయం స్పిల్‌వే, క్రస్ట్ గేట్లు, కుడి కాల్వ రెగ్యులేటర్లను పరిశీలించారు. స్పిల్‌వే నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా లీకేజీ వాటర్‌ను ఎప్పటికప్పుడు కట్టడి చేయాలని అధికారులకు సూచించారు.
సీపీఐ వినతి పత్రం
ఈ సమయంలోనే కేఆర్ఎంబీ సభ్యులు పిళ్లైకి నల్గొండ జిల్లా సీపీఐ(CPI) తరఫున పలువురు నేతలు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అంతకుముందు నాగార్జున సాగర్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఎన్ఎస్పీ అధికారులతో కేఆర్ఎంబీ బృందం సమావేశమైంది. రెండు రోజులుగా నాగార్జున సాగర్ జలాశయాన్ని పరిశీలించిన సభ్యులు... సాగర్ పరిధిలోని కుడి కాలువ, దానిపై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, స్పిల్ వే, క్రస్ట్ గేట్స్, ఎడమ కాలువ, సీపేజ్ వాటర్ లెవల్స్‌పై చర్చించారు.
రెండు రోజుల పర్యటన
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకునేందుకు కృష్ణా బోర్డు (Krishna River Management Board) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెలలో జరిగిన బోర్డు (Krishna River Management Board news) సమావేశంలో అప్పగించేందుకు గుర్తించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కంపోనెంట్లను క్షేత్రస్థాయిలో సందర్శించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నిన్న, ఇవాళ నాగార్జునసాగర్‌లో ఉపసంఘం (KRMB Subcommittee news) పర్యటించింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం.. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయాన్ని పరిశీలించింది. సాగర్ పరిధిలోని కంపోనెంట్ల క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా... ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును సభ్యులు సందర్శించారు. తొలుత బీఆర్కే పిళ్లై ఆధ్వర్యంలో 15 మంది సభ్యులు... తొలుత పెద్దఆడిశర్లపల్లి మండలంలోని పుట్టంగండి పరిశీలించారు. అనంతరం అక్కంపల్లి జలాశయం, పుట్టంగండి సిస్టర్న్, పుట్టంగండి పంప్‌హౌజ్‌లను సందర్శించారు. వాటి పనితీరు గురించి... స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో జెన్కోతో పాటు... నీటిపారుదల విభాగాల కార్యకలాపాలపై ఇంజినీర్లను వివరాలు అడిగారు. పుట్టంగండి పరిశీలన అనంతరం కేఆర్ఎంబీ సభ్యులు... వరద కాల్వ, సాగర్ ప్రధాన డ్యామ్, కుడి కాల్వ, కుడి కాల్వపై గల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. సోమవారం డ్యామ్ పరిశీలించగా... నేడు మరోసారి ఆనకట్టను సందర్శించారు.
ఇదీ చదవండి: KRMB NEWS: నాగార్జునసాగర్‌లో కేఆర్ఎంబీ బృందం పర్యటన.. ప్రాజెక్టు పరిశీలన..