Komatireddy fire on KTR: తనను కోవర్ట్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కోవర్టు అనే పదం వాడటానికి నీకున్న అర్హత ఏంటని.. ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. రాజకీయమంటే అప్పనంగా అధికారం అనుభవిస్తూ కోట్ల అవినీతి చేయటం కాదన్నారు. అమరుల ఆత్మలు ఘోషిస్తుంటే విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేయటం అసలే కాదన్నారు.
'నేషనల్ మీడియాను అడిగితే కోవర్టులెవరో తెలుస్తోంది': నీ భాష.. పద్ధతేంటని.. ఇంతకీ చదివింది అమెరికాలోనా.. గల్లీలోనా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నతమైన హోదాను గడ్డిపోచలా వదులుకున్నానని గుర్తు చేశారు. సాగరహారంలో తనను తాకిన రబ్బరు బుల్లెట్లను.. ఆనాడు తన వెంట నడిచిన లక్షలాది జనాలను అడగాలని రాష్ట్రంలో ఎవరు ప్రజానాయకులో.. ఎవరు కోట్లు వెనకేసుకున్న కోవర్టులో తెలుస్తుందన్నారు. దిల్లీ లిక్కర్ స్కాంలో నేషనల్ మీడియాను అడిగితే కోవర్టులెవరో తెలుస్తుందన్నారు.
'నల్గొండ జనానికి తాగునీరు రాకుండా చేసిందెవరో అందరికి తెలుసు': నమ్మినెత్తిన పెట్టుకున్న తెలంగాణ జనాన్ని ముంచి దిల్లీలో సెటిల్‌మెంట్లు చేసుకుని ఎంజాయ్ చేస్తున్న కోవర్టులెవరని అడిగారు. ప్రతి రోజూ ఈడీ, ఐటీ దాడులు ఎవరి అనుచరులు కంపెనీల మీద జరుగుతున్నాయో.. ఎవరు అరెస్టు అవుతున్నారో రోజూ న్యూస్ చూసే ఎవరినైనా అడిగితే తెలుస్తుందన్నారు. నల్గొండ జనానికి తాగునీరు రాకుండా చేసిందెవరో అందరికి తెలుసన్నారు.
'ఏ దేవాలయంలోనైనా చర్చించడానికి సిద్ధం': నువ్వు దిల్లీకి కోవర్టువు కాదని ఒట్టేసి చెప్పే దమ్ముందా అంటూ కేటీఆర్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంతో పాటు ప్రతి ప్రాజెక్టులోనూ కమీషన్లు బొక్కే కల్వకుంట్ల ఫ్యామిలీ మీదని ఆరోపించారు. యాదాద్రి, భాగ్యలక్ష్మీ ఆలయం, వరంగల్ భద్రకాళి, బాసర సరస్వతి ఇలా ఎక్కడికైనా చర్చించడానికి తాను సిద్ధమని మీరు సిద్ధమేనా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
ఇవీ చదవండి: