Kattangur Co operative Society Nalgonda : నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి చొరవతో.. రెండేళ్ల క్రితం కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటైంది. ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు తన వాటా ధనం కింద వెయ్యి రూపాయలు, సభ్యత్వ రుసుం కింద మరో వంద రూపాయలు చెల్లించి సుమారు 10 లక్షల వరకు సమకూర్చారు.
ఇందులో సభ్యులుగా ఉన్న రైతులు పండించే వరి, పత్తి, నిమ్మ పంటలకు మద్దతు ధరలతో పాటూ వీటి సాగుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను తక్కువ ధరకు అందించేలా ప్రత్యేకంగా వీరే.. ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. రెండేళ్ల నుంచి సుమారు 50 లక్షల రూపాయల వరకు ఎరువులు, విత్తనాలను విక్రయించగా.. మరో 50 లక్షల విలువైన నిమ్మ పంటను హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విక్రయించారు. దాంతో 10 లక్షల వరకు లాభాలను అర్జించారు. రైతులకు సైతం బహిరంగ మార్కెట్ కంటే 30 శాతానికి పైగా లాభాలు వచ్చాయి.
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిమ్మ సాగవుతుంది. కానీ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. సరైన కోల్డ్‌స్టోరేజ్‌లు లేక ఇబ్బందులు ఎదురువుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి.. రైతు ఉత్పత్తిదారుల సంఘంలో 120 కిలోవాట్ల సోలార్ విద్యుత్‌తో నడిచే 12 కోల్డ్‌స్టోరేజ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం, నాబార్డు రుణంతో ఒక్కోదానికి రూ.15 లక్షలు ఖర్చు చేశారు.
నిమ్మతో పాటు టమాట ఇతర పంటలను ఇందులో నిల్వ చేసుకుంటున్నారు. రైతులకు అవసరమయ్యే పనిముట్లను సైతం బహిరంగ మార్కెట్ కంటే 20 శాతం తక్కువ ధరకు అద్దెకు ఇస్తున్నారు. 5 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు ప్రస్తుతం ఈ సంఘం వద్ద ఉన్నాయి. దీని వల్ల ప్రతి రైతుకు ఎకరాకు 4 నుంచి 5 వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతోంది.
విజయవంతంగా నడుస్తున్న ఈ సంఘంను.. రంగారెడ్డి, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీల నుంచి పలువురు శాస్త్రవేత్తలు, ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం, ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని, రైతులకు కలుగుతున్న లాభాలను.. ఆయా ప్రాంతాల్లో వివరిస్తున్నారు.
సంఘటిత వ్యవసాయంతో రైతుల పంటలకు లబ్ధి చేకూరుతుందని.. ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా నిరూపితమవుతోంది. రానున్న కాలంలో మరింత మంది రైతులను చేర్చుకొని, మరిన్ని పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలతో ఎంవోయూ చేసుకొని.. ఇక్కడి ఉత్పత్తులను నేరుగా ఎగుమతి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పెట్టుబడిని తగ్గించి.. అన్నదాతల ఆదాయం పెంచడం మా సంఘం ప్రధాన ఉద్దేశం. తక్కువ ధరకే ఎరువులు, విత్తనాల సరఫరా చేస్తున్నాము. రైతులకు అవసరమయ్యే పనిముట్లను సైతం బహిరంగ మార్కెట్ కంటే 20 శాతం తక్కువ ధరకు అద్దెకు ఇస్తున్నాము. - సైదమ్మ, సంఘం ఛైర్మన్
ఇవీ చదవండి: