నల్గొండ పట్టణంలోని రామగిరి సెంటర్లో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో పాల్గొని.. సంతకాలు సేకరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని జానారెడ్డి మండిపడ్డారు. ప్రజల గొంతు అణిచి వేయడం, ప్రజల సమస్యలను పరిష్కరించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రైతుల గొంతుకు ఉరి బిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 3 చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులను చైతన్య పరచాల్సిన అవసరం ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. దళితులు, మహిళలపై అత్యాచారాలు జరగడం.. ప్రశ్నించే వారిపై దాడులు చేయయం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్‌నాయక్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలి: కేటీఆర్