దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా గత ఏడేళ్ల కాలంలో మైనార్టీల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనారిటీ విద్యాసంస్థల్లో 91వేల మంది మైనార్టీ విద్యార్థులు విద్యను అభ్యసించడం గర్వంగా ఉందన్నారు. మైనారిటీ సంక్షేమమే కాక అన్ని వర్గాల ప్రజల అభివృద్ధితో పాటు రైతుల కోసం 24 గంటల విద్యుత్, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన అన్నారు.
సుదీర్ఘకాలం అనేక శాఖలకు మంత్రిగా పని చేశానని చెప్పుకుంటున్న జానారెడ్డి.. తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారని మహమూద్ అలీ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయిన అభివృద్ధిని ఇప్పుడు ఎలా చేస్తాడో ప్రజలు ఆలోచించాలని మంత్రి అన్నారు. ప్రజా సేవ చేయాలంటే వయసు సహకరించాలని... యువకుడు, విద్యావంతుడైన నోముల భగత్‌కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: ఒక్కసారి అవకాశం ఇవ్వండి: భాజపా అభ్యర్థి రవికుమార్