నల్గొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం మిల్లులకు పంపిన ధాన్యంలో... 93 శాతం బియ్యాన్ని రికవరీ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గత యాసంగిలో కొనుగోళ్లు జరిపిన అధికారులు.. సీఎంఆర్ విషయంలోనూ ముందడుగు వేశారు. జిల్లాలో 6 లక్షల 49 వేల 229 మెట్రిక్ టన్నులు మిల్లులకు పంపగా.. సీఎంఆర్ కింద 4 లక్షల 41 వేల 114 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలి. అందులో ఇప్పటివరకు... 4 లక్షల 8 వేల 179 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించి ఎఫ్సీఐకి అప్పగించారు.
ఇతర జిల్లాల భాగస్వామ్యం లేకుండా
ఇంకో 9 శాతం మేర.. 32 వేల 935 మెట్రిక్ టన్నులు తీసుకోవాల్సి ఉంది. ఇతర జిల్లాల భాగస్వామ్యం లేకుండా గత యాసంగిలో నల్గొండ జిల్లాలోనే 6.49 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరగ్గా.. పక్క జిల్లాల సరకుతో కలిపి పెద్దపల్లి జిల్లా 7.61 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. అయినా ఆ జిల్లాలో సీఎంఆర్ రికవరీ రేటు.. 69 శాతంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 64.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపగా.. సేకరించాల్సిన లక్ష్యం 43.62 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. అందులో 69.38 శాతం మేర 30.27 లక్షల మెట్రిక్ టన్నులు రాబట్టారు.
11 వందల 91 కోట్ల విలువ గల ధాన్యాన్ని కొన్నారు
నల్గొండ జిల్లా అధికారులు గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యం.. రాష్ట్రంలోని 13 జిల్లాలతో సమానం. లక్ష 6 వేల 31 మంది రైతుల నుంచి.. 11 వందల 91 కోట్ల విలువ గల ధాన్యాన్ని కొన్నారు. ఇంచుమించు రికవరీ రూపేణా ఇప్పటిదాకా 11 వందల 50 కోట్లకు పైగా తీసుకోగలిగారు. మిల్లర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎఫ్సీఐ సూచనల ప్రకారం.. తమిళనాడు, పశ్చిమ్ బంగా, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు నల్గొండ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా పంపుతుంటారు. నల్గొండ జిల్లాలో 107 మిల్లులకు సీఎంఆర్ వర్తింపజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రికవరీ రేటు వంద శాతం ఉన్నా.. అక్కడ మిల్లులకు పంపిన మొత్తం ధాన్యం కేవలం 5 వేల 450 మెట్రిక్ టన్నులు కాగా.. పూర్తిస్థాయిలో 3 వేల 686 మెట్రిక్ టన్నులు రాబట్టగలిగారు.
అధికారుల ముందు చూపు
పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన జిల్లాల పరంగా చూస్తే నిజామాబాద్ 79, సిద్దిపేట 74, సూర్యాపేట 68, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 66 శాతం చొప్పున రికవరీ చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లోనూ నల్గొండ అధికారులు.. ఇప్పటికే 5 శాతం బియ్యాన్ని మిల్లుల నుంచి తీసుకున్నారు. ప్రభుత్వం అందించే బియ్యంతో వ్యాపారం నిర్వహించే మిల్లర్లు.. సీఎంఆర్ చెల్లింపులో పేచీ పెడుతుంటారు. ఏ సీజన్లో కొన్న ధాన్యానికి ఆ సీజన్లోనే నెల, రెణ్నెల్ల లోపు బియ్యాన్ని అప్పగించాల్సి ఉన్నా.. గత వానాకాలం బియ్యాన్ని ఈ వానాకాలంలో అంటగట్టే సందర్భాలున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ గత వానాకాలానికి సంబంధించిన రికవరీ నడుస్తోంది. కానీ నల్గొండ జిల్లా అధికారులు ముందు నుంచి ఆయా సీజన్లపైనే దృష్టి పెడుతున్నారు. సకాలంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లులకు వచ్చే సీజన్లలో ధాన్యాన్ని ఇవ్వబోమని ఖరాకండీగా చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించే ధాన్యం అంటగట్టొద్దంటూ మిల్లర్లు పేచీ పెడుతున్నా.. వాటి ద్వారా వచ్చే ఆదాయం భారీగా ఉంటోంది. అందుకే పైకి వద్దంటున్నా.. సీఎంఆర్ కింద ధాన్యం రావాలని మిల్లర్లు కోరుకుంటారు.
ఇదీ చదవండి: 'ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదు'