Foundation stone for Civil Judge Court new building: కోర్టుల్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు చొరవ చూపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ శావిలి అన్నారు. శనివారం.. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్ పక్కన కోర్టుకు కేటాయించిన 29 గుంటల స్థలంలో నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ అభినంద్‌కుమార్ శావిలితో పాటు మరో నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ కె.లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నిడమనూరు కోర్టులో దాదాపు 3,600 కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 3,000 క్రిమినల్ కేసులే అని తెలిసి న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కోర్టు భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని.. అందుకు తమ నుంచి అన్నివిధాలా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. త్వరితగతిన కోర్టు నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తామని నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా జడ్జి జగ్జీవన్‌కుమార్, అదనపు జిల్లా జడ్జి రఘునాథ్‌రెడ్డి, నిడమనూరు కోర్టు జడ్జి పురుషోత్తమరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు నోముల భగత్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఇదీ చదవండి: Group1 Notification: ఉగాది తర్వాతే గ్రూప్-1 నోటిఫికేషన్..!